Tammareddy Bharadwaja: చిరంజీవిని జాకీతో లేపాల్సిన అవసరం లేదు!
ABN , First Publish Date - 2022-12-30T18:03:35+05:30 IST
‘ఓ వ్యక్తికి కష్టకాలం వస్తే చాలామంది ముఖం చాటేస్తారు. ఆ మనిషి ఎదుటపడినా చూసీ చేడనట్లు వదిలేస్తారు. అదే వ్యక్తికి మంచి రోజులు రాగానే సిగ్గు విడిచి వెనక్కి వస్తారు. ముఖం చాటేసిన చోటే ఆలింగనాలు చేసుకుంటారు’’ అని తాజా ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
‘‘ఓ వ్యక్తికి కష్టకాలం వస్తే చాలామంది ముఖం చాటేస్తారు. ఆ మనిషి ఎదుటపడినా చూసీ చేడనట్లు వదిలేస్తారు. అదే వ్యక్తికి మంచి రోజులు రాగానే సిగ్గు విడిచి వెనక్కి వస్తారు. ముఖం చాటేసిన చోటే ఆలింగనాలు చేసుకుంటారు’’ అని తాజా ఇంటర్వ్యూలో సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy bharadwaja) అన్నారు. ఇండస్ట్రీలో టాప్‌లో ఉన్న ప్రతి హీరో ఒకానొక సమయంలో కష్టకాలాన్ని చూసిపవారే.. ఈ ఇండస్ట్రీలో అవసరాల కోసం వచ్చేవారే ఎక్కువ. అలాంటి వాళ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిది. చాలామంది సోషల్ మీడియా వేదికగా చిరంజీవి, బాలకృష్ణ గురించి ఏవేవో మాట్లాడుతుంటారు. చిరంజీవికి మార్కెట్ (chiranjeevi market)తగ్గిపోయిందని, పక్కన మరో హీరో ఉంటేనే ఆయన సినిమాలు నడుస్తున్నాయని కొందరు కారు కూతలు కూసేవారు. నాకు తెలిసి 1 నుంచి 10 వరకు చిరంజీవిగారే. పాత రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు కూడా లీన్ టైమ్ చూశారు. మళ్లీ వాళ్ల దార్లోకి వచ్చారు. అందరికీ ఓ పీరియడ్ వస్తుంది. ఇక్కడ ఎవరి స్థానం వాళ్లకి ఉంటుంది. ఎవరి స్థాయి వారిది. చిరంజీవిగారిని ఎవరో వచ్చి జాకీ పెట్టి లేపాల్సినంత అవసరం లేదు. ఆయన ఫాలోయింగ్, క్రేజ్ రెవెన్యూ ఎక్కడికి పోలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన విషయంలో నాగబాబు మాట్లాడకపోతేనే మంచిది. (Comments on Chiranjeevi )
ఇటీవల ఓ కార్యక్రమంలో ఎవరో చిరంజీవిగారికి రెడ్ కార్పెట్ పరిచారు. తర్వాత తక్కువగా మాట్లాడారు అని ఆయన అన్నారు. నాకు తెలిసి చిరంజీవిగారు కొన్ని విషయాలను అసలు పట్టించుకోరు. ఆయన కెరీర్‌లో ఇలాంటి వాటిని ఎన్నో చూశారు. ఎన్నింటినో చూసుకుని వచ్చారు. చిరు స్థాయికి ఇవన్నీ పట్టించుకోకూడదు. ఒకవేళ అలాంటి విషయాలను మనం బయటకు చెప్పామంటే చిరంజీవిగారిని తగ్గించి ఎదుటి వ్యక్తిని పెంచినట్లు అవుతుంది. మరి ఆ రెడ్ కార్పెట్ వేసిన వ్యక్తి చిరంజీవిగారితో ఏ అవసరం వచ్చి వచ్చారో మనకు తెలియదు. అదెవరో కూడా నేను పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవటం ఎందుకు? నాగబాబుగారు అలాంటి విషయాలను మాట్లాడకపోతే.. చిరంజీవిగారి గౌరవం ఇంకా పెరుగుతుందని నా అభిప్రాయం’’ అని అన్నారు.
నేను చూసిన కొన్ని విషయాలు...
అన్న ఎన్టీఆర్‌గారు లీన్ పీరియడ్‌లో ఉన్నప్పుడు ఆయన రెమ్యూనరేషన్ కంటే ఆయన పరిచయం చేసిన వాణిశ్రీ రెమ్యూనరేషన్ మూడు రెట్లు ఉండేది. శోభన్‌బాబుగారు రెండింతలు రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్లు. తర్వాత నిప్పులాంటి మనిషితో హిట్ కొట్టారు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లారో మనం చూశాం. నాగేశ్వరరావుగారి విషయానికి వస్తే.. ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లి వచ్చారు. అక్కడ ఆయనకు లీన్ పీరియడ్ వచ్చింది. మామూలుగా ఎ.ఎన్.ఆర్‌గారు చెన్నైకి వెళ్లినప్పుడు సవేరా హోట్‌లో దిగేవారు. నాగేశ్వరరావుగారికి నిర్మాతలు స్పెషల్‌గా భోజనం పంపేవారు. కానీ లీన్ పీరియడ్‌లో అలా ఎవరూ చేయలేదు. ఎందుకంటే వారందరూ శోభన్‌బాబు దగ్గరకి వెళ్లిపోయారు. ప్రేమాభిషేకం తర్వాత ఆయన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. మళ్లీ ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారు. ఇండస్ట్రీలో అవసరానికి వచ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ ఒకేలా ఉండేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ల గురించ మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.