Kaikala Satyanarayana: ‘యమదొంగ’ వదులుకోవడానికి కారణమిదే!
ABN , First Publish Date - 2022-12-23T20:06:48+05:30 IST
యముడు (Yama) అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కైకాల సత్యన్నారాయణ (Kaikala Satyanarayana). యముడిగా ఆయన ఎన్నో సినిమాలలో
యముడు (Yama) అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కైకాల సత్యన్నారాయణ (Kaikala Satyanarayana). యముడిగా ఆయన ఎన్నో సినిమాలలో నటించారు. అత్యద్భుతమైన అభినయంతో.. నిజంగా యముడు ఇలానే ఉంటాడా? అనేలా సత్యన్నారాయణ తన నటనతో మెప్పించారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘యమదొంగ’ (Yamadonga) చిత్రంలో మాత్రం ఆయన నటించలేదు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) హీరోగా వచ్చిన ఈ చిత్రంలో యముడి పాత్రకు తనని సంప్రదించారని అప్పట్లో సత్యన్నారాయణ పేర్కొన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను ‘యముడు పాత్రంటే మీకు ఇష్టమా?’ అని అడుగగా..
‘‘మొట్టమొదట యమగోలలో నేను, రామారావు (NT Ramarao)గారు వేశాం. ఇద్దరం పోటాపోటీగా చేశాం. మొదట్లో నన్ను దుర్యోధనుడిగా పనికిరానన్నారు. చివరకు ఎవరూ సరిపోక రామారావుగారిని అడిగితే.. ఆయన తిట్టి, నన్ను సూచించారు. అలాగే యముడి పాత్రలోనూ ఆయనకు నాకు పోటీయే. తర్వాత చిరంజీవి (Chiranjeevi)తో ‘యముడికి మొగుడు’ (Yamudiki Mogudu) చేశా. పిట్టలదొర, యమలీల.. ఇలా ఏ సినిమాలోనైనా యముడి పాత్ర వేయాలంటే నేనే అన్నట్లు వచ్చింది. రాముడు, కృష్ణుడు తప్ప రామారావుగారు వేసిన వేషాలన్నీ వేశాను. ఓసారి రామారావు గారి డూప్‌గా కృష్ణుడి పాత్ర కూడా వేశాను. యమదొంగలోనూ అవకాశం వచ్చినా.. డబ్బుల విషయంలో తేడా వచ్చి నేను వేయనన్నాను. మోహన్‌బాబుతో కొన్ని సినిమాలలో తేడా వచ్చింది..’’ అని అప్పట్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో సత్యన్నారాయణ చెప్పుకొచ్చారు.