S.S.Rajamouli: విజయానికి రహస్యాలేమీ ఉండవు!

ABN , First Publish Date - 2022-12-13T13:31:27+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఓ బ్రాండ్‌గా మారిపోయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి ఇటీవల గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌-2023(Golden Globe Award)కు నామినేట్‌ అయింది.

S.S.Rajamouli: విజయానికి రహస్యాలేమీ ఉండవు!

విజయానికి రహస్యాలేమీ ఉండవు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఓ బ్రాండ్‌గా మారిపోయింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి ఇటీవల గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌-2023కు నామినేట్‌ అయింది. ఆంగ్లేతర భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీలో ఈ అవార్డుకు నామినేట్‌ అయింది. ఈ చిత్రం ఇప్పటికే ‘లాస్‌ఏంజెల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ బెస్ట్‌ మ్యూజిక్‌ కేటగీరిలో కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే బోస్టన్‌ సొసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌లో కూడా కీరవాణి బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విన్నర్‌గా అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందంపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు, నెటిజన్లు. తాజాగా రాజమౌళి ఈ విషయంపై ఓ ఆన్‌లైన్‌ మీడియా సంస్థతో మాట్లాడారు.

‘‘విజయానికి ప్రత్యేకంగా రహస్యమేమి ఉండదు. ఓ పని చేపట్టి దానిని సక్సెస్‌ చేయాలంటే నేను రెండే విషయాలు నమ్ముతా. ఎవరికైనా అదే చెబుతాను. మొదట ప్రేక్షకులతో అనుబంధం ఉండాలి. ఆడియన్స్‌ పల్స్‌ తెలుసుకోవాలి. రెండోది కష్టపడడం. మనం ఎంత కష్టపడితే అంత విజయాన్ని సాధిస్తాం. అప్పుడే ఆ విజయాన్ని ఆస్వాదిస్తాం. సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తే ఆ సమయంలో పొందే ఆత్మ సంతృప్తి వర్ణించడానికి మాటలు చాలవు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో మేకర్స్‌ ఎప్పుడూ అర్థం చేసుకోవాలి. ఒక సినిమా తీయడం మొదలుపెట్టినప్పుడు అందరికీ రకరకాల సందేహాలు వస్తాయి. ఎందుకంటే ఫిల్మ్‌ మేకింగ్‌ అనేది చాలా మంది మనసులతో ముడిపడిన పని. చేసిన సినిమా సక్సెస్‌ అవుతుందా లేదా.. ఇలాంటి ఎన్నో సందేహాలు వెంటాడతాయి. వీటన్ని మధ్య ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో పని చేయాలి’’ అని చెప్పారు.

ఈ చిత్రం షూటింగ్‌లో నిద్ర లేని రాత్రులు గడిపారా అన్న ప్రశ్నకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ సమయంలో నిద్ర లేని రాత్రులు గడిపాం. తారక్‌తో యానిమల్‌ సీక్వెన్స్‌ని షూట్‌ చేస్తున్నప్పుడు మాత్రమే మేమంతా నిద్రలేని రాత్రులు గడిపాం. ఎందుకంటే అవన్నీ రాత్రి సమయంలో చిత్రీకరించాల్సిన సన్నివేశాలు కాబట్టి’’అని చమత్కరిచారు రాజమౌళి.

prabhas.jpg

ప్రభాస్‌-తారక్‌ అభినందనలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌-2023 అవార్డుకు నామినేట్‌ అయినందుకు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు ప్రభాస్‌. జక్కన్న అందుకుంటున్న పురస్కారాలు చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. తారక్‌ కూడా రాజమౌళికి, చిత్ర బృందానికి కంగ్రాట్స్‌ చెప్పారు.

Updated Date - 2022-12-13T16:34:56+05:30 IST