Superstar Krishna: సూపర్‌స్టార్‌కు ‘మా ఊళ్లో ఒక పడుచుంది’ అంకితం
ABN , First Publish Date - 2022-12-18T21:43:08+05:30 IST
విజయ్ సినీ క్రియేషన్స్ (Vijay Cine Creations) పతాకంపై వీరు.కె. రెడ్డి (Veeru K Reddy) దర్శకత్వంలో.. సోమా విజయ్ ప్రకాష్ (Soma Vijay Prakash) నిర్మిస్తున్న వినూత్న
విజయ్ సినీ క్రియేషన్స్ (Vijay Cine Creations) పతాకంపై వీరు.కె. రెడ్డి (Veeru K Reddy) దర్శకత్వంలో.. సోమా విజయ్ ప్రకాష్ (Soma Vijay Prakash) నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘మా ఊళ్లో ఒక పడుచుంది’ (Ma Oollo Oka Paduchundhi). దెయ్యమంటే భయమన్నది (Deyyamante Bayamannadhi) ఉప శీర్షిక. షూటింగ్ కంటే ముందు ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని, ప్రపంచ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో భారత్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ రికార్డును నమోదు చేసి, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chelluboyina Venugopalakrishna) చేతుల మీదుగా ధృవీకరణ పత్రం అందజేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఈ వేడుకలో నిర్మాత సోమా విజయ్ ప్రకాష్, దర్శకులు వీరు కె.రెడ్డి, ప్రముఖ దర్శకులు నీలకంఠ, భారత్ వరల్డ్ రికార్డ్స్ (Bharath World Records) చైర్మన్ రమణారావు (Ramanarao), జ్యూరీ మెంబర్ ఇంద్రాణి, ప్రముఖ నిర్మాతలు ముత్యాల రాందాసు, రవి కనగాల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘కృష్ణగారు నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి ‘అవే కళ్లు’. అందులో ‘మా ఊళ్లో ఒక పడుచుంది... దెయ్యమంటే భయమన్నది’ అనే పాట ఇప్పటికీ చాలా పాపులర్. ఆ పేరుతో ఓ వినూత్నమైన ప్రయోగం చేస్తూ రూపొందించిన చిత్రాన్ని కృష్ణ గారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. షూటింగ్ మొదలు కాకుండానే డబ్బింగ్, ఎడిటింగ్, రీ-రికార్డింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న చిత్రంగా చరిత్ర పుటల్లో నమోదు కావడం, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని నా చేతుల మీదుగా అందించడం గర్వంగా ఉంది’’ అన్నారు. తమ చిత్ర ప్రత్యేకతను యావత్ సినిమా ప్రపంచం గుర్తించేలా చేసిన భారత్ వరల్డ్ రికార్డ్స్ చైర్మన్ రమణారావు, సదరు రికార్డును అందించేందుకు ఎంతో శ్రమ తీసుకుని హైదరాబాద్ విచ్చేసిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు నిర్మాత సోమా విజయ్ ప్రకాష్, దర్శకులు వీరు.కె.రెడ్డి కృతఙ్ఞతలు తెలియజేశారు.