Kaikala Satyanarayana: కైకాల లేరంటే బాధగా ఉంది- కృష్ణంరాజు సతీమణి
ABN , First Publish Date - 2022-12-23T16:52:57+05:30 IST
నవరసాలను పండించగల నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) ఇప్పుడు మనమధ్య లేరంటే బాధగా ఉందని అన్నారు దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju) సతీమణి..
నవరసాలను పండించగల నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) ఇప్పుడు మనమధ్య లేరంటే బాధగా ఉందని అన్నారు దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు (Rebel Star Krishnam Raju) సతీమణి శ్యామలా దేవి (Shyamala Devi). కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఈ రోజు కైకాల సత్యనారాయణగారు కాలం చేశారు అని తెలిసి చాలా బాధ పడ్డాం. ఆయన భార్య కుమార్తెలతో మేమంతా చాలా క్లోజ్‌గా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. మొన్నామధ్య కృష్ణంరాజుగారు.. సత్యనారాయణ మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని అంటే ఖచ్చితంగా వస్తానని, మీరు ఒక టైం చూసి చెప్పమన్నారు. అయితే ఆయన మా ఇంటికి రాలేక పోయారు. కైకాల సత్యనారాయణ.. కృష్ణంరాజు గారితో అనేక అద్భుతమైన సినిమాల్లో నటించారు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (Bobbili Brahmanna) సినిమాలో కృష్ణంరాజుగారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు.. అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమే, అలాంటి ఒక లెజండరీ నటుడు ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడు అంటే అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజుగారు అంటూ ఉండేవారు. నవరసాలను పండించగల నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మనమధ్య లేరంటే బాధగా ఉంది. ఇదే ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ దూరం అవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. కైకాల వారి కుటుంబం అంతా దృఢంగా ఉండేలా ఆ దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’’ అని కృష్ణంరాజు సతీమణి శ్యామల అన్నారు.