Kaikala Satyanarayana: కౌతవరం చేపలంటే కైకాలకు ప్రీతి

ABN , First Publish Date - 2022-12-23T22:03:57+05:30 IST

కృష్ణా జిల్లా.. గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం (Kowthavaram) కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) జన్మించిన గ్రామం. అమ్మమ్మ, తాతయ్యలు...

Kaikala Satyanarayana: కౌతవరం చేపలంటే కైకాలకు ప్రీతి
Kaikala Satyanarayana

కృష్ణా జిల్లా.. గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం (Kowthavaram) కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) జన్మించిన గ్రామం. అమ్మమ్మ, తాతయ్యలు కంభంమెట్టు రామయ్య, నాగమ్మ. వారి ఇంట్లోనే లక్ష్మీనారాయణ, సీతారావమ్మ దంపతులకు తొలి సంతానంగా జన్మించారు. కూతురి తొలిబిడ్డ కావడంతో అమ్మమ్మ, తాతయ్య ఎంతో గారాబంగా పెంచారు. ఎంతో సరదాగా ఆయన బాల్యంలో కౌతవరంలో గడిపారు. స్నేహితులతో కలిసి కొబ్బరి చెట్లెక్కడం, మామిడికాయలు కోయడం, తనకు ఎంతో ఇష్టమైన వెంకటనారాయణ చెరువులో ఈత కొట్టడం.. ఇలా అల్లరి ఎక్కువగా చేసేవాడని గ్రామస్థులు చెబుతారు. ఆయన పెరిగి పెద్దవాడై నటుడై, పార్లమెంటు సభ్యుడైనా ఆయనకు కౌతవరం గ్రామమన్నా, వారి స్నేహితులన్నా ఎంతో ఇష్టం. గ్రామం నుంచి ఎవరు వెళ్లినా అందరినీ అడుగుతూ వారి యోగక్షేమాలు తెలుసుకొనేవారు. భోజనప్రియుడైన సత్యనారాయణకు కౌతవరం వెంకటనారాయణ చెరువు (Venkata Narayana Cheruvu) చేపలంటే ఎంతో ప్రీతి. ఏటా నాలుగైదుసార్లు ఇక్కడ నుంచి చేపల కూర వెళ్లాల్సిందే. ఆయనకు వెళ్లిన ఆ చేపల కూరను చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) ఇలా తనకు నచ్చిన వారికి కూడా మా వెంకటనారాయణ చెరువు చేపల కూర చాలా బాగుంటుందని పంపేవారట. అదే ఇష్టంతోనే ఆయన ఎంపీ అయ్యాక ఆ చెరువు చుట్టూ రివిట్‌మెంట్‌ వాల్‌ ఏర్పాటు చేయించారు. కౌతవరం గ్రామానికి ఏం కావాలి, ఏం చేయాలన్నా నన్ను అడగండి చేస్తా లేదా చేయిస్తా అని తన మిత్రులతో చెప్పేవారట.

గ్రామానికి కైకాల చేసిన పనులు

తన సొంత స్థలంలో తల్లిదండ్రుల పేరున గ్రామంలో మెటర్నిటీ ఆస్పత్రి నిర్మించారు. గ్రామంలో పీహెచ్‌సీ మంజూరు చేయించారు. ఆయన ఎంపీ అయ్యాక డొంక రోడ్డుగా ఉన్న చేవెండ్ర రోడ్డును బీటీ రోడ్డుగా వేయించారు. రహదారి పాడైపోయిందని గ్రామస్థులు చెబితే టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్లు గ్రాంట్‌ చేయించారు. ఇటీవలే రిజిస్టర్‌ కార్యాలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. గ్రామంలో పలు సీసీ రోడ్ల నిర్మాణం చేయించారు. వెంకటనారాయణ చెరువుకు రివెట్‌మెంట్‌ నిర్మించారు. పలువురికి ఉద్యోగాలు ఇప్పించారు.

చిన్ననాటి స్నేహితులు

స్నేహానికి విలువనిచ్చే వ్యక్తి సత్యనారాయణ అంటారు. బాల్యంలో కైకాలతో స్నేహంగా ఉన్నవారు. వారి చిన్ననాటి స్నేహితుల్లో ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌, మాజీ డీజీపీ టీఎస్‌ రావు, మాజీ డీఎస్పీ బాడిగ పోతురాజు, తూము గౌతమేశ్వరరావు, రంజిత్‌కుమార్‌, సమ్మెట పూర్ణచంద్రరావు, తమ్మారెడ్డి బసవ శంకరరావు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల వ్యవస్థాపకుడు వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు, వల్లభనేని బాబూరావు, మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి చిన్ననాటి స్నేహితులు. గ్రామంలో ఆయన తరువాతి తరం వారైన చాపరాల జగపతిబాబు, బాడిగ ఫణిభూషణరావు, చాపరాల సుబ్బారావ, వీబీకేబీ సుబ్బారావు(బాబూరావు), కానూరి బాలు, బొబ్బా నరసింహరావు, మత్తి రాజారావు, తూము కుటుంబరావుతో సన్నిహితంగా ఉండేవారు.

Updated Date - 2022-12-23T22:09:28+05:30 IST