Chiranjeevi: ఆ ఆకలి లేకపోతే.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోండి

ABN , First Publish Date - 2022-12-27T22:02:40+05:30 IST

మెగాస్టార్ వంటి ఇమేజ్, స్టార్‌డమ్ వచ్చిన తర్వాత కూడా.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నటించడం, డే అండ్ నైట్ వర్క్ చేయడం.. అలాగే తడుస్తూ.. చేయాల్సిన అవసరం ఉందా..

Chiranjeevi: ఆ ఆకలి లేకపోతే.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోండి
Waltair Veerayya Press Meet

మెగాస్టార్ వంటి ఇమేజ్, స్టార్‌డమ్ వచ్చిన తర్వాత కూడా.. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నటించడం, డే అండ్ నైట్ వర్క్ చేయడం.. అలాగే తడుస్తూ.. చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఖచ్చితంగా ఉంది అన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). రాబోయే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ (Aluminium Factory)లో వేసిన సెట్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశమంత స్టార్‌డమ్ వచ్చిన తర్వాత కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా? అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. నటీనటులందరికీ హితోపదేశం చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘ఖచ్చితంగా కష్టపడాలి. అలా కష్టపడని రోజున బెటర్ టు రిటైర్డ్.. ఇంటికెళ్లిపోవచ్చు. ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న నటీనటులందరికీ చెబుతున్నాను. ఒక్కసారి సినిమా అంగీకరించిన తర్వాత.. ఎటువంటి ఇబ్బందులైనా ఫేస్ చేయాల్సిందే. దానిని ఇబ్బందిగా ఫీల్ కాకూడదు.. దానిని బయట ప్రపంచానికి తెలియనీయ కూడదు. అన్నిటికీ తలొగ్గి చేయాల్సిందే. అలా చేస్తేనే.. న్యాయం చేసినట్లు.. ఈ ఫీల్డ్‌లో అర్హత ఉన్నట్లు. అలా చేయలేకపోతే.. గెట్ లాస్ట్.. ఇంటికెళ్లిపోండి. నా బిగినింగ్ డేస్‌లో ఒక యాక్టర్‌గా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నప్పుడు చేశాను కదా. అలా చేస్తేనే తారాస్థాయి, ఈ స్టార్‌డమ్ వచ్చింది. మాములుగా రమ్మంటే వస్తుందా? అప్పుడు ఎలా కష్టపడి పేరు సంపాదించుకున్నానో.. ఆ పేరు నిలబడాలన్నా కష్టపడాల్సిందే. నేను కష్టపడుతుంటే.. అయ్యో అని ఎవరైనా సింపతీ చూపిస్తే.. నాకు చాలా బాధగా ఉంటుంది. నటుడిగా ఇండస్ట్రీలోకి (Cinema Industry) అడుగుపెట్టి.. ఎన్ని వందల సినిమాలు చేసినా.. ఎప్పుడూ వేషాల కోసం ఆకలితో ఉన్నట్లుగా ఉండాలి. ఆ ఆకలి చనిపోయిన రోజున ఈ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోండి. ఎప్పుడూ ఆకలితోనే ఉండాలి.. పాత్ర కోసం కష్టపడుతూనే ఉండాలి. అప్పుడే నీ వృత్తికి న్యాయం చేసినట్లు అవుతుంది. దీనిని నేను ఆచరిస్తాను.. ఈ రోజుకీ కట్టుబడి ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా సరే.. అది మైనస్ డిగ్రీల టెంపరేచర్ అయినా.. డ్యాన్స్ చేశాను. ఇంటికి వెళ్లిన తర్వాత బాధపడతాం.. చలికి అన్నీ పట్టేస్తాయి. బాధ అనేది ఉంటుంది.. కానీ ఆ బాధను వ్యక్తపరచడం కానీ, తెరపై చూపించడం కానీ చేయను. ఎంతైనా కష్టపడతాను.. ప్రేక్షకులు, అభిమానులు కొట్టే క్లాప్స్ నాకు తెలిసిపోతుంటుంది. అందుకే ఎంత బాధ అయినా కూడా నాకు బాధ అనిపించదు..’’ అని ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ చిరు సందేశమిచ్చారు.

Updated Date - 2022-12-27T22:05:56+05:30 IST