Chalapati rao: వంద రేప్ సీన్లు పూర్తి చేద్దామనుకున్నా!
ABN , First Publish Date - 2022-12-25T14:58:32+05:30 IST
అన్నా.. ఇక్కడి పొలాలకు దాహం ఎక్కువ.. మనుషులకు ఆకలి ఎక్కువ.. వీటికి తాగడానికి నీరు ఉండదు.. మేం తినడానికి అన్నం ఉండదు... మా ఆకలిని అలుసుగా తీసుకుని ఈ చేతికి కత్తి ఇచ్చి... ఇంకో చేతిలో ముద్ద పెడతారు.
‘‘అన్నా.. ఇక్కడి పొలాలకు దాహం ఎక్కువ.. మనుషులకు ఆకలి ఎక్కువ..
వీటికి తాగడానికి నీరు ఉండదు.. మేం తినడానికి అన్నం ఉండదు...
మా ఆకలిని అలుసుగా తీసుకుని ఈ చేతికి కత్తి ఇచ్చి... ఇంకో చేతిలో ముద్ద పెడతారు. (Chalapati rao Dialogue from AAdi)
ఇది తినాలంటే.. ఈ కత్తి పట్టక తప్పదు అన్నా...
నువ్వు తలచుకుంటే ఇక్కడ అంతా మూడుపూట్ల అన్నం తింటాం అన్నా’’
ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమా పెద్దన్న పాత్రలో చలపతిరావు చెప్పిన ఈ డైలాగ్ ఇది.
ఆ డైలాగ్‌లో ఎంత భావోద్వేగం ఉందో.. ఆయన నటన, డెలివరీలో కూడా అంతే భావోద్వేగం పండింది. ఇలాంటి డైలాగ్‌లే కాకుండా... నవ్వును పుట్టించే డైలాగ్‌లను ఆయన అలవోకగా పలికించగలరు. తనదైన శైలి నటనతో లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న చలపతిరావు (Rip Chalapati rao)ఇక లేరు. ఆదివారం ఉదయం గుండెపోటుతోఆయన మరణించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఆయన ఆసక్తికర విషయాలు...
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన నటనపై ఆసక్తితో నాటకాలు వేసేవారు. ఎన్టీఆర్‌తో పరిచయం, చనువు పెరగడంతో ఆ చొరవతో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు. చిన్న పాత్రతో మొదలైన కెరీర్ ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. ‘‘నా దృష్టిలో రామారావుగారే ఒక్కరే ఆర్టిస్ట్. ఏయన్నార్, శోభన్‌బాబు, కృష్ణ నా దృష్టిలో ఆర్టిస్ట్‌లే కాదు. వాళ్లు కనిపిస్తే విష్ చేసిన సందర్భాలు కూడా లేవు. ఒకవేళ వాళ్ల సినిమాల్లో ఏదన్నా వేషం వచ్చినా.. ఈయన రామారావుగారి మనిషి అంటూ పక్కకు తోసేసేవారు. నేను రామారావుగారి దగ్గరే ఉండేవాడిని. ఆయన తప్ప వేరే వారికి గౌరవం కూడా ఇచ్చే వాడిని కాదు. ఎవరినీ లెక్క చేయకుండా పొగరుగా ఉండేవాడిని. ఓ సారి అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ సంస్థలో సినిమాకోసం పిలిచారు. ఎలా ఉండాలో చెప్పారు. అప్పుడు నాలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఎదుటివారిని గౌరవించడం మొదలుపెట్టా. చెన్నైలో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు దాని గృహప్రవేశానికి ముహూర్తం పెట్టింది ఎన్టీఆరే! గృహ ప్రవేశం నాడు ఉదయం ఇంటికి కూడా వచ్చారు. ఆయనకు ఇష్టమని గోధుమ రవ్వ ఉప్మా, మీగడ పెరుగు చేసి పెడితే తిని వెళ్లారు. ’’ అని చెప్పుకొచ్చారు.
కంటనీరు తెచ్చిన సందర్భం..
‘‘19 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నా. 28 ఏళ్ల వయసులో భార్య చనిపోయింది. ముగ్గురు పిల్లల్ని బాగా పెంచాలనే టార్గెట్ పెట్టుకున్నా. పెళ్లి సమయంలోనే నా భార్యకు మందు, సిగిరెట్ లాంటివి మానేస్తా అని మాటిచ్చా. ఆ మాట ప్రకారమే ఇప్పటికీ ఉన్నా. నా భార్య మరణిస్తూ... మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినా నేను పెళ్లి జోలికి వెళ్లకుండా సినిమాల్లో నటిస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇద్దరు ఆడ పిల్లలు, అబ్బాయి రవిబాబును బాగా చదివించాను. రవిబాబు మూడుసార్లు గోల్డ్ మెడల్స్ అందుకున్నాడు. అమ్మాయిలిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. రెండో అమ్మాయి డెట్రాయిట్లో ఎమ్మెస్ చేసి అక్కడి యూనివర్శిటీలో టాఫర్‌గా నిలిచారు. రిజల్ట్ వచ్చిన రోజు తండ్రికి చిన్న కూతురు ఫోన్ చేసి ‘నాన్న నీ కూతురు డెట్రాయిట్ యూనివర్శిటీలో ఫస్ట్ వచ్చిందని గర్వంగా చెప్పు’’ అని చెప్పింది. ఆ సమయంలో తన బిడ్డ మాటలు విని కన్నీరు ఆగలేదని చలపతిరావు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో చెప్పారు. ‘‘మనం ఎక్కడి నుంచి వచ్చాం.. ఎలా బతికాం.. మన బిడ్డలు ఇంత సాధించారే అని చాలా ఆనందం కలిగింది’’ అని చలపతిరావు చెప్పారు.
వంద రేప్‌లు చేద్దామనుకున్నా...
నా తొలి చిత్రం ‘కథానాయకుడు’ కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. ఈ చిత్రానికి గోపాల కృష్ణ నిర్మాత. మళ్లీ కొన్నాళ్లకు ప్రారంభించి సినిమా పూర్తి చేశారు. బాగా ఆడి మంచి వసూళ్లు తెచ్చిందా సినిమా. తర్వాత గోపాలకృష్ణ గారు సినిమాల తీయనని చెప్పి వెళ్లిపోయారు. ‘చేతి దాకా వచ్చిన అవకాశం పోయింది’ అని బాధపడ్డా. ఎప్పటికప్పుడు కష్టం వచ్చేది. దాని వెనకాలో కర్తవ్యం ఉండేది. దాంతో ఏడుపు వచ్చేది కాదు. పోనీ హీరోగా చేద్దాం అంటే అప్పటికే కృష్ణ. శోభన్‌బాబు లాంటి చాలామంది హీరోలున్నారు. విలన్‌గా చేద్దామంటే.. సత్యనారాయణ, త్యాగరాజు లాంటి వారున్నారు. ఏంం తోచేది కాదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండిపోదామని అనుకున్నా. ఇదే విషయం రామారావుగారికి కూడా చెప్పా. అప్పటి నుంచి అన్ని రకాల పాత్రలు వేయడం మొదలురెడీ అయ్యాయి. నా కెరీర్లో 94 రేప్ .సన్నివేశాలు చేశా. రేప్ సీన్ చేయడం అంత ఈజీ కాదు. నేను రేప్ చేసిన హీరోయిన్లు అందరూ బాలీవుడ్‌కి వెళ్లిపోయి మంచి స్థాయిలో ఉన్నారు. నా భార్యకు ఇచ్చిన మాట ప్రకారం అలాంటి సన్నివేశాలు చేయడం మానేశా. ఇంకో ఆరు రేప్‌లు చేసి వంద పూర్తి చేద్దాం అనుకున్నా. కానీ కుదరలేదు. నా జీవితంలో జరిగిన రెండు మూడు సంఘటనల ఆధారంగా నా ఆప్తుడు ఈ.వి.వి. సత్యనారాయణ సినిమాలుగా తీశాడు. ఆయన తెరకెక్కించిన ‘మా నాన్నకు పెళ్లి’ నా కథే.
బోయపాటి వల్లే కోలుకున్నా...
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు చిన్న ప్రమాదం జరిగింది. బస్ పైన సన్నివేశమది. అక్కడి నుంచి జారి పడిపోయా. అంత వరకే నాకు తెలుసు. మూడు రోజుల తర్వా ఆస్పత్రిలో ఉన్నా. పక్కటెముకలు విరిగాయి. వెన్నెముకకు దెబ్బ తగిలింది. కాలు విరిగింది. అంతా మంచం మీదే. దాదాపు ఆరు నెలల పైగా బెడ్ పైనే ఉన్నా. ‘ఎందుకీ బతుకు చచ్చిపోదామా’ అనిపించింది. ఒక కన్ను కూడా దెబ్బతింది. డాక్టర్ మల్లికా మూడు ఆపరేషన్లు చేశారు. పెద్ద వయసు కదా! కాల సెట్ కావడానికి ఎనిమిది నెలలు పట్టింది. ఇప్పటికీ నొప్పిగా ఉంటుంది. ప్రమాదం గురించి తెలియగానే నా కూతుళ్లు ఇండియా వచ్చేశారు. ఆ ప్రమాదం తర్వాత మంచానికే పరిమితం కావడం నచ్చని బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామ’ చిత్రంలో యాక్ట్ చేయించాడు. బాబాయ్‌ని ఎలా తీసుకొస్తారో నాకు తెలీదు.. నా సెట్లో ఉండాలి. షూటింగ్లో ఉంటే బాధ మరచిపోతాడు’ అని చెప్పాడట. అలాగే నన్ను బ్యాంకాక్ తీసుకెళ్లారు. వీల్ ఛైర్లో ఫ్లైట్ ఎక్కాను. ఆ ప్రమాదం నుంచి నేను కోలుకోవడానికి సంవత్సరం పట్టేది బోయపాటి వల్ల ఆరు నెలల్లో కోలుకున్నా’’ అని చెప్పారు.