Ilayaraja: శివాజీ గణేషన్‌కు తగిన గౌరవం దక్కలేదు!
ABN , First Publish Date - 2022-12-20T14:31:15+05:30 IST
క్రమశిక్షణలో శివాజీ గణేషన్ మించిన వారు మరొకరు ఉండరన్నారు ఇళయరాజా. ఆయన్నుంచి నేను నేర్చుకున్న అనేక విషయాల్లో కాలం, సమయపాలన ఒకటని ఆయన పేర్కొన్నారు.
క్రమశిక్షణలో శివాజీ గణేషన్ (Sivaji ganeshan)మించిన వారు మరొకరు ఉండరన్నారు ఇళయరాజా(ilayaraja). ఆయన్నుంచి నేను నేర్చుకున్న అనేక విషయాల్లో కాలం, సమయపాలన ఒకటని ఆయన పేర్కొన్నారు. ఆయన్ను చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం సరైన రీతిలో సత్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇళయరాజా. రచయిత మరుదు మోహన్ నటుడు శివాజీ గణేషన్ గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. దర్శకుడు భారతిరాజా, కె. భాగ్యరాజ్, ముత్తులింగం, నటుడు ప్రభు(Prabhu), రాంకుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడుతూ ‘‘క్రమశిక్షణకు మారుపేరు శివాజీ గణేషన్. తన కారు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు స్టూడియో ముందు ఆగుతుంది. ఓసారి నేను ఆలస్యంగా రావడంతో ‘ఏంటి రాజా నువ్వు కూడా ఆలస్యంగా రావడమేంటి’ అని అడిగారు. రికార్డింగ్ స్టూడియోలో ఆయన తన అనుభవాలన్నీ పంచుకునేవారు. ఓసారి పరిశ్రమ తరఫున శివాజీ గణేషన్‌కు అభినందన సభ జరిగింది. ఆయనకు ఓ కానుకగా గుర్రం మీద కూర్చుని సెల్యూట్ చేస్తున్న జ్ఞాపిక అందించాలని నిర్ణయించాం. అందుకు కావలసిన నగదును పరిశ్రమ వర్గాల నుంచి వసూలు చేశాం. కమల్‌హాసన్, రజనీకాంత్ అంత పెద్ద మొత్తం ఇవ్వలేం అన్నారు. నటీనటులు తినే ప్రతి బియ్యం గింజ పైన శివాజీ గణేషన్ పేరు ఉంటుంది. దానికి అయ్యే ఖర్చును తానే ఇస్తానని చెప్పాను. ఆ జ్ఞాపికపై ఎవరి పేరు ఉండకూడదని కోరాను. ఆ విషయం తెలిసి శివాజీ గణేషన్ ఎవరిని మరిచినా ఇళయరాజాను మరవకూడదని అన్నారు. శివాజీని సినిమా పెద్దలు గానీ, ప్రభుత్వాలు తన స్థాయికి తగిన రీతిలో గుర్తింలేదు. ప్రభుత్వం ఆయన స్థాయికి తగిన విధంగా సత్కరించలేదు. వ్యక్తిగతంగా ఆయన ఎవరైనా చేశారంటే అది ఈ ఇళయ రాజానే’’ అని అన్నారు.