Vishal: నన్ను అలా పిలవొద్దు.. విజయ్‌ని డైరెక్ట్ చేస్తా..
ABN , First Publish Date - 2022-12-14T09:42:10+05:30 IST
నేను ‘పురట్చి దళపతి’ని కాదు.. నా పేరు విశాల్ (Vishal). నేను విశాల్ మాత్రమే’ అని అభిమానులకు హీరో విశాల్ తేల్చి చెప్పారు.
నేను ‘పురట్చి దళపతి’ని కాదు.. నా పేరు విశాల్ (Vishal). నేను విశాల్ మాత్రమే’ అని అభిమానులకు హీరో విశాల్ తేల్చి చెప్పారు. తనను ‘పురట్చి దళపతి’ అని పిలవద్దని ఆయన ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేశారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘లత్తి’ (Lathi) (తెలుగులో ‘లాఠీ’) ట్రైలర్ (Trailer) ను తాజాగా విడుదల చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జాంగిడ్, యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందం సమక్షంలో తమిళం, తెలుగు ట్రైలర్లను రిలీజ్ చేశారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 22న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని రాణా ప్రొడక్షన్స్ బ్యానరుపై నటులు రమణ - నంద కలిసి నిర్మించారు.
ఈ మూవీలో రాఘవ్ అనే బాల నటుడు విశాల్ కుమారుడిగా నటించగా.. దర్శకుడిగా ఆర్.వినోద్ పరిచయమవుతున్నారు. విశాల్ సరసన సునైనా హీరోయిన్‌గా నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ ట్రైలర్ రిలీజ్‌లో విశాల్ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ కథ చెప్పగానే చాలా ఫీలయ్యాను. సినిమా చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు కూడా అలాంటి అనుభూతికి లోనవుతాడు. సినిమా షూటింగ్‌లో ఉద్దేశ పూర్వకంగా గాయపడలేదు. కథలో భాగంగా యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తుంటే అనుకోకుండా దెబ్బలు తగిలాయి. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రూపొందింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ లక్కీఫెలో. ఆయనలాగే నేను కూడా ‘ఇళయ దళపతి’ విజయ్‌కు కథ చెప్పి, ఒప్పించి డైరెక్ట్ చేయాలని వుంది’ అని పేర్కొన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ జాంగిడ్ మాట్లాడుతూ.. ‘విశాల్ వంటి హీరో కానిస్టేబుల్ పాత్రలో నటించడం అభినందనీయమన్నారు.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. ‘నాకు యాక్షన్ చిత్రాలంటే అమితమైన ఇష్టం. ఈ ట్రైలర్ చూడగానే ఎంతో ఉత్సాహం చెందాను. మీతోపాటే నేను కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎదురు చూస్తుంటాను’ అని అన్నారు. ఆ తర్వాత దర్శకుడు వినోద్, నిర్మాతలు రమణ, నంద, కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం, మాటల రచయిత పొన్ పార్తిపన్, దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్, ఎడిటర్ శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు.