హీరోకు ఏనుగును ఇచ్చిన దర్శకుడు
ABN , First Publish Date - 2022-09-08T07:14:06+05:30 IST
మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అనే ముద్ర దర్శక నిర్మాత విజయబాపినీడు మీద ఉండేది. ఆయన సక్సెస్ జర్నీలో సహ ప్రయాణికుడు బాపినీడు...

మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అనే ముద్ర దర్శక నిర్మాత విజయబాపినీడు మీద ఉండేది. ఆయన సక్సెస్ జర్నీలో సహ ప్రయాణికుడు బాపినీడు. పట్నం వచ్చిన పతివ్రతలు.. చిరంజీవి, బాపినీడు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం. అయితే ఈ చిత్రానికి మౌళి దర్శకత్వం వహించారు. చిరంజీవి నటించిన మగ మహారాజు చిత్రం తోనే బాపినీడు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తన స్నేహితుడు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి తో కలసి శ్యాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి చిరంజీవితో ఆరు చిత్రాలు తన దర్శకత్వంలో నిర్మించారు బాపినీడు. ఇందులో బిగ్ బాస్ చిత్రం మినహా మిగిలిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్టే. ఒకరినొకరు గౌరవించు కుంటూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు ఇద్దరూ.
చిరంజీవి, భానుప్రియ కాంబినేషన్లో విజయబాపినీడు నిర్మించిన మరో సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ నంబర్ 786’. 1987 అక్టోబర్ 25న తొలి క్లాప్ ఇచ్చి ఈ చిత్రం షూటింగ్‌కు శోభన్‌బాబు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి హీరోలు కృష్ణ, కృష్ణంరాజు కూడా హాజరు కావడం విశేషం. 1988 జూన్ 10న ‘ఖైదీ నంబర్ 786’ చిత్రం విడుదలైంది. అంటే బాలకృష్ణ పుట్టిన రోజున చిరంజీవి చిత్రాన్ని విడుదల చేశారన్న మాట! ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది.
చిత్ర విజయోత్సవం లో తన హీరో చిరంజీవికి ఏకంగా ఏనుగును బహూకరించి అందర్నీ ఆశ్చర్య పరిచారు బాపినీడు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో నే కాదు దేశంలోనే ఎవరూ ఎక్కడా ఇటువంటి కానుక ఇవ్వలేదు. కళా బంధు సుబ్బిరామిరెడ్డి సలహా పై చిరంజీవి ఆ ఏనుగును తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందజేశారు. అలాగే ప్రతి సినిమాకు ఫస్ట్‌హాఫ్, సెకండ్ హాఫ్ ఉన్నట్లు ఖైదీ నంబర్ 786 వంద రోజుల వేడుక ను ఒకే రోజు పొద్దున, సాయంత్రం నిర్వహించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు బాపినీడు.
ఈ సినిమాలోని ‘గువ్వా గోరింకతో’... పాట ఆల్ టైం హిట్ సాంగ్. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ‘సుప్రీమ్’ చిత్రంలో ఈ పాటను రీమిక్స్ చేశారు.