‘అబ్బాయిగారు’ సినిమా వెనుక ఇంత కథ ఉంది

ABN , First Publish Date - 2022-03-30T00:58:53+05:30 IST

తమిళ నటుడు, దర్శకుడు కే. భాగ్యరాజా 1987లో రూపొందించిన ‘ఎంగ చిన్న రాజా’ చిత్రం ఘన విజయం సాధించింది. ఇందులో భాగ్యరాజా సరసన రాధ నటించారు. తక్కువ బడ్జెట్‌లో తీసిన ఈ చిత్రం కలెక్షన్లు తెలుగు నిర్మాతలనే కాకుండా బాలీవుడ్‌ను కూడా ఆకర్షించాయి. అనిల్ కపూర్..

‘అబ్బాయిగారు’ సినిమా వెనుక ఇంత కథ ఉంది

తమిళ నటుడు, దర్శకుడు కే. భాగ్యరాజా 1987లో రూపొందించిన ‘ఎంగ చిన్న రాజా’ చిత్రం ఘన విజయం సాధించింది. ఇందులో భాగ్యరాజా సరసన రాధ నటించారు. తక్కువ బడ్జెట్‌లో తీసిన ఈ చిత్రం కలెక్షన్లు తెలుగు నిర్మాతలనే కాకుండా బాలీవుడ్‌ను కూడా ఆకర్షించాయి. అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ జంటగా ‘బేట’ పేరుతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. ‘బేట’ ఘన విజయం సాధించడమే కాకుండా 1992లో బాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రంలోని ‘అబ్బనీ తీయని దెబ్బ’.. పాట ట్యూన్‌ని యధాతథంగా తీసుకొని, కంపోజ్ చేసిన ‘థక్ థక్ కర్నే లగా..’ పాట ఉత్తరాదిని ఊపేసింది.


ఇక తెలుగు విషయానికి వేస్తే.. ‘ఎంగ చిన్న రాజా’ చిత్రంలోని మదర్ సెంటిమెంట్ నచ్చి హీరో కృష్ణ తెలుగు రీమేక్ హక్కులు కొన్నారు. తను హీరోగా పద్మాలయ బ్యానర్‌పై రీమేక్ చేయాలని అనుకున్నారు కృష్ణ. ఇందులో తల్లి పాత్రకు సీనియర్ నటి వాణిశ్రీ‌నీ సంప్రదించారు. అయితే గతంలో నటి, దర్శకురాలు విజయ నిర్మలతో ఏర్పడిన వివాదం కారణంగా హీరో కృష్ణతో సినిమా అనగానే వాణిశ్రీ అంగీకరించలేదు. ఈ ప్రాజెక్ట్ ఆమె వద్దనుకుంది. హీరో కృష్ణ, విజయశాంతి జంటగా అంతకు ముందు ‘నాగాస్త్రం’ చిత్రాన్ని నిర్మించిన నన్నపనేని సోదరులు అంకప్ప చౌదరి, అన్నారావు ‘ఎంగ చిన్న రాజా’ చిత్రాన్ని హీరో కృష్ణతో రీమేక్ చేయడానికి ముందుకు వచ్చారు.


అయితే ఎందువల్లనో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. హీరో కృష్ణ డ్రాప్ అయ్యారని తెలియగానే, నిర్మాత రాశీ మూవీస్ అధినేత నరసింహారావు రూ. 30 లక్షలకు పద్మాలయా వారి దగ్గర కొని ‘అబ్బాయిగారు’ పేరుతో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. ‘అబ్బాయిగారు’ చిత్ర ప్రారంభోత్సవానికి హీరో కృష్ణ హాజరయ్యారు. తొలి క్లాప్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘చంటి’ చిత్రం రికార్డులను ‘అబ్బాయిగారు’ క్రాస్ చేస్తుందని హీరో కృష్ణ అంటుండేవారు. 1993 సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ చెప్పినట్లుగానే కొన్ని ఏరియాల్లో ‘చంటి’ చిత్రాన్ని క్రాస్ చేసింది.

-వినాయకరావు

Updated Date - 2022-03-30T00:58:53+05:30 IST