చాణక్య- చంద్రగుప్తని దెబ్బ తీసిన ‘అడవిరాముడు’
ABN , First Publish Date - 2022-11-05T05:30:00+05:30 IST
ఒక ఒర లో రెండు కత్తులు ఇమడలేవు అంటారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఇద్దరు రారాజులకు స్థానం ఉండదు. రాజు అంటే ఎవరో ఒక్కరే ఉండాలి.

ఒక ఒర లో రెండు కత్తులు ఇమడలేవు అంటారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఇద్దరు రారాజులకు స్థానం ఉండదు. రాజు అంటే ఎవరో ఒక్కరే ఉండాలి. కానీ అది నిజం కాదని నిరూపించారు మహా నటులు ఎన్టీఆర్, ఏయన్నారు.. వారిద్దరి చెలిమి, వారి ఆలోచనా విధానం వల్లే పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే.
ఎన్టీఆర్ పౌరాణికాలలో రారాజు. అక్కడ ఆయన్ని పడగొట్టేవాడు లేడు. ఇక సాంఘికాల్లో తనకు తిరుగులేదని అనిపించు కొన్నారు అక్కినేని. వీరిద్దరూ కలసి 14 సినిమాల్లో నటించారు. శ్రీకృష్ణార్జున యుద్థం చిత్రం తర్వాత మళ్లీ కలసి నటించడం కాదు కదా ఎన్టీఆర్, ఏయన్నార్ మధ్య దాదాపు 14 ఏళ్ల పాటు మాటలే లేవు. తిరిగీ 1977లో విడుదల అయిన చాణక్య చంద్రగుప్త చిత్రంతో ఈ అన్నదమ్ములు మళ్లీ కలిశారు.
ఎన్టీఆర్‌కు చాణక్యుని పాత్ర పోషించాలనే కోరిక ఉండేది. దానికోసం స్ర్కిప్ట్ కూడా సిద్థం చేసుకొన్నారు. అయితే ఆ పాత్ర తను పోషిస్తానని అక్కినేని చెప్పడంతో చాణక్యుడి పాత్ర ఆయనకు ఇచ్చి, తను చంద్రగుప్తుని పాత్ర పోషించారు. ఎన్టీఆర్. దాన వీర శూర కర్ణ చిత్రం ప్రారంభమైన కొన్ని రోజులకు అంటే 1976 జూలై ఒకటిన హైదరాబాద్ లోని రామకృష్ణా స్టూడియోలో ‘చాణక్య-చంద్రగుప్త’ షూటింగ్ మొదలైంది. ..తెలుగు చలన చిత్ర చరిత్రలో ఓ అగ్ర హీరో దర్శకత్వంలో మరో అగ్ర హీరో నటించడం అదే మొదలు, చివరిది కూడా. దానవీరశూరకర్ణ చిత్రం షూటింగ్ కొన్ని రోజులు ఆపుజేసి, చాణక్య చంద్రగుప్త లో తను, అక్కినేని పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు ఎన్టీఆర్. తన సొంత సినిమాలో తొలిసారిగా నటిస్తున్న బ్రదర్ అక్కినేనికి తనకంటే ఎక్కువ పేరురావాలని ఎంతో కృషి చేశారు ఎన్టీఆర్.
ఈ అగ్ర నటులు మళ్లీ కలుసుకోవడం తో ఇరువర్గాల అభిమానుల ఆనందానికి అవధులు లేవు. చాణక్య చంద్రగుప్త చిత్రం కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎన్టీఆర్, ఏయన్నార్ లతో పాటు తమిళ అగ్ర కథానాయకుడు శివాజీ గణేశన్ కూడా ఈ చిత్రంలో నటించడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. అయితే ఆ రేంజ్ లో సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. గ్రేట్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఇది కాదని అబిమానులు కూడా నిరాశ చెందారు. అడవి రాముడు చిత్రం విడుదలైన నెల రోజులకు చాణక్య చంద్రగుప్త చిత్రం విడుదల అయింది. ఆ వేవ్ లో ఈ సినిమా కూడా కొట్టుకు పోయింది.