మహేశ్‌బాబు చేస్తే ఆ ‘యమలీల’ వేరేగా ఉండేది!
ABN , First Publish Date - 2022-01-25T00:10:44+05:30 IST
చిన్న చిన్న వేషాలు, హాస్య పాత్రలు పోషిస్తున్న అలీని హీరోని చేసి, ఆయన కెరీర్‌ను సరికొత్త మలుపు తిప్పిన చిత్రం ‘యమలీల’. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో, అద్భుతమైన కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సరికొత్త ట్రెండ్ క్రియేట్

చిన్న చిన్న వేషాలు, హాస్య పాత్రలు పోషిస్తున్న అలీని హీరోని చేసి, ఆయన కెరీర్‌ను సరికొత్త మలుపు తిప్పిన చిత్రం ‘యమలీల’. తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో, అద్భుతమైన కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో మొదట హీరోగా అనుకున్నది అలీ కాదు.. మహేశ్ బాబు. అప్పటికి ఆయన హీరోగా పరిచయం కాలేదు. అందుకే మహేశ్‌ను హీరోగా పరిచయం చేసే తొలి అవకాశం తనే తీసుకోవాలనుకున్నారు కృష్ణారెడ్డి. హీరో కృష్ణకు కథ చెప్పారు. ఆయనకు నచ్చింది కూడా. అయితే కొన్ని అవరోధాలు ఏర్పడడంతో మహేశ్‌తో వర్క్ చేసే ఛాన్స్ మిస్ అయింది. అప్పుడు హీరో ఎవరా.. ఎవరా అని ఆలోచిస్తుంటే హాస్య నటుడు అలీ కనిపించారు. వెంటనే ఆయన్నే హీరోగా బుక్ చేశారు. మహేశ్‌బాబుతో తీద్దామనుకున్న కథ వేరు. అలీని హీరో అనుకున్న తర్వాత ఎన్నుకున్న కథ వేరు. చేతిలో ఒక్క రూపాయి తప్ప మరేమీ లేని వ్యక్తి కోటి రూపాయల ప్యాలెస్ కొని, తల్లికి కానుక ఇద్దామనుకున్న ఓ సాధారణ యువకుడి కథ అది. ఆ పాత్రలో అలీని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఇక యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం, విలన్‌గా తనికెళ్ల భరణి, పోలీస్ ఇన్స్పెక్టర్గా కోట శ్రీనివాసరావు.. ఇలా సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షుకుల్ని అలరించింది. ‘యమలీల’ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ సూపర్ స్టార్ కృష్ణ చేసిన స్పెషల్ సాంగ్.
అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ప్రారంభమైన ‘యమలీల’ ఎవరూ ఊహించని విజయం సాధించింది. ఎంత పెద్ద హిట్ అంటే 1994 ఏప్రిల్ 14న బాలకృష్ణ నటించిన జానపదం ‘భైరవ ద్వీపం’ విడుదల అయింది. వారం తర్వాత అంటే ఏప్రిల్ 20న నాగార్జున తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ‘హలో బ్రదర్’ రిలీజ్ అయింది. ఈ రెండు చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఏప్రిల్ 28న విడుదలైన ‘యమలీల’ ఆ రెండు భారీ చిత్రాలతో పోటీ పడి, ఘన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2014లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘యమలీల 2’ మాత్రం సక్సెస్ కాలేదు.
-వినాయకరావు