Chiranjeevi: టాలీవుడ్‪కు ఆ సాంకేతిక ప్రక్రియను పరిచయం చేసింది చిరంజీవే!

ABN , First Publish Date - 2022-05-08T00:11:10+05:30 IST

తెలుగు సినిమా చరిత్రలో సినిమాలు లేక, రాక ఖాళీగా ఉన్న హీరోల గురించి విన్నాం కానీ.. ఏ సినిమా చేయాలో అర్థంకాక అంతర్మథనంలో ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్న తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) మాత్రమే. తనమీద..

Chiranjeevi: టాలీవుడ్‪కు ఆ సాంకేతిక ప్రక్రియను పరిచయం చేసింది చిరంజీవే!

తెలుగు సినిమా చరిత్రలో సినిమాలు లేక, రాక ఖాళీగా ఉన్న హీరోల గురించి విన్నాం కానీ.. ఏ సినిమా చేయాలో అర్థంకాక అంతర్మథనంలో ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్న తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) మాత్రమే. తనమీద  జరుగుతున్న కోట్లాది రూపాయల వ్యాపారానికి, తనపై  ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు సరి తూగే చిత్రాన్ని ఇవ్వాలంటే ట్రెండ్ మార్చక తప్పదని ఆయన భావించారు. అందుకే ఇమేజ్ చట్రంలో నుంచి బయటకు వచ్చి, నటించిన కొత్త తరహా చిత్రం ‘హిట్లర్’ (Hitler) ప్రేక్షకుల ప్రశంసలు పొందటంతో.. ఆ తరహాలో మరిన్ని విభిన్న పాత్రలు చేయడానికి మెగాస్టార్‪కు కొత్త ఉత్సాహం వచ్చింది. అలాగే అంతవరకు ఆయన సీనియర్ డైరెక్టర్స్‪తో మాత్రమే వర్క్ చేశారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‪తోనూ పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాత మెగాస్టార్ అంగీకరించిన తొలి చిత్రం ‘మాస్టర్’ (Master). తమిళ చిత్ర రంగ సూపర్ స్టార్ రజినీకాంత్(SuperStar Rajinikanth) ‪తో ‘అన్నామలై (Annamalai), బాషా (Basha)’ వంటి రెండు సూపర్ హిట్స్ తీసిన దర్శకుడు సురేష్ కృష్ణ(Suresh Krissna)‪తో.. మెగాస్టార్ తొలిసారిగా వర్క్ చేసిన చిత్రం ఇది. మాస్ ఫాలోయింగ్ అమితంగా ఉండే స్టార్స్‪ను ఎలా డీల్ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు కావడంతో సురేష్  కృష్ణ‪కు ‘మాస్టర్’ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు గీతా ఆర్ట్స్ (Geetha Arts) అధినేత అల్లు అరవింద్ (Allu Aravind).


‘మాస్టర్’ చిత్రంలో తెలుగు లెక్చరర్‪గా చిరంజీవి (Chiranjeevi) నటించారు. సాధారణంగా తెలుగు లెక్చరర్ అనగానే పంచెకట్టుతో, పిలక జుట్టుతో ఉంటాడని ఊహించు కోవడం సహజం. కానీ ఈ మాస్టర్ మాత్రం మోడరన్‪గా, జీన్స్ వేసుకొని స్టైలిష్ గా ఉంటాడు. మాస్టర్‪కి, స్టూడెంట్స్‪కి గ్యాప్ అనేది ఏ రకంగానూ ఉండకూడదని వాళ్లకు స్నేహితుడిగా మారి, మంచి మార్గంలో నడిపించే పాత్రను చిరంజీవి పోషించారు.


‘మాస్టర్’ చిత్రంలో తొలిసారిగా ఓ పాట కూడా పాడారు చిరంజీవి. ‘లావారిస్’(Laawaris) చిత్రంలో అమితాబ్ (Amitabh Bachchan) .. ‘మేరే అంగనోం మే’ పాట పాడారు. ఆ స్ఫూర్తితో ఈ సినిమాలో చిరంజీవి పాట పాడాల్సిందేనని పట్టు పట్టారు సురేశ్ కృష్ణ. ముందు ఊహు అన్నా.. అరవింద్ కూడా కోరడంతో పాడక తప్పలేదు చిరంజీవికి. ‘తమ్ముడు.. అరె తమ్ముడు.. ఈ తికమక తెగులే ప్రేమంటే..’ అంటూ సాగే ఈ పాటను సీతారామశాస్త్రి (Sitaramasastri) రాశారు. క్యాంటీన్ 2000 పేరుతో వేసిన మోడరన్ క్యాంటీన్ సెట్‪లో చిరంజీవి, సాక్షి శివానంద్ (Sakshi Shivanand), ఉత్తేజ్, తిరుపతి ప్రకాశ్, గణేష్, వేణుమాధవ్ వంటి వారిపై ఈ పాటను చిత్రీకరించారు. లారెన్స్ (Lawrence) నృత్య దర్శకుడు. ఈ పాట అంత ప్రజాదరణ పొందుతుందని పాట పాడేటప్పుడు చిరంజీవి కూడా ఊహించలేదు. ‘మాస్టర్’ చిత్ర విజయానికి ఈ పాట కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


ఇప్పుడు ప్రతి సినిమాకి డిటిఎస్ (DTS) తప్పనిసరి. అయితే శబ్దపరమైన ఈ సరికొత్త సాంకేతిక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలిచిత్రం ‘మాస్టర్’. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక ప్రింట్లతో విడుదలయ్యే సినిమా ఎప్పుడూ చిరంజీవిదే. ఆయన చిత్రాల బిజినెస్ స్టామినాకు ఇది ఒక నిదర్శనం. తెలుగు చలనచిత్ర చరిత్ర (Telugu Cinema History) లోనే తొలిసారిగా 121 ప్రింట్లతో, 200 థియేటర్లలో 1997 అక్టోబర్ 2న ‘మాస్టర్’ చిత్రం విడుదలైంది. అన్ని కేంద్రాల్లోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే మొదటి వారం చిత్రం మీద కొంత డివైడ్ టాక్ వచ్చింది. టాక్ అంతగా లేదని, కలెక్షన్లు మాత్రం బాగున్నాయని అన్నారు. రెండు వారాల్లోనే ఈ చిత్రం ఐదున్నర కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.  మూడో వారం నుంచి కలెక్షన్స్ విపరీతంగా పెరిగి, చిత్రం ఘన విజయం సాధించింది.

-వినాయకరావు (Vinayakarao)

Updated Date - 2022-05-08T00:11:10+05:30 IST