మొదట్లో గుండమ్మ కథ.. ఆ తర్వాత ముందడుగు
ABN , First Publish Date - 2022-07-17T07:39:58+05:30 IST
తొలి తరం అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏయన్నార్ నటించిన అద్భుత చిత్రం ‘గుండమ్మ కథ’. ఇది ఎన్టీఆర్‌కు నూరవ చిత్రం.

తొలి తరం అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏయన్నార్ నటించిన అద్భుత చిత్రం ‘గుండమ్మ కథ’. ఇది ఎన్టీఆర్‌కు నూరవ చిత్రం. అక్కినేనికి 99వ సినిమా. వారిద్దరి ఇమేజ్, ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ తక్కువలు లేకుండా ఇద్దరి పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ, జాగ్రత్తగా తీసిన చిత్రం ‘గుండమ్మ కథ’ .విజయా సంస్థ 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆణిముత్యం ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ అంత పర్ఫెక్ట్గా రూపుదిద్దుకున్న మరో మల్టీస్టారర్ మూవీ ‘ముందడుగు’. శోభన్‌బాబు, కృష్ణ ఇందులో హీరోలుగా నటించారు. 1983న ఈ సినిమా తయారయ్యేనాటికి వీరిద్దరూ టాప్ హీరోలు. అందుకే సినిమాలో ఎక్కువ, తక్కువ అని కాకుండా ఇద్దరి పాత్రలూ సమాన స్థాయి కలిగి ఉంటాయి. ‘ముందడుగు’లో కోటీశ్వరుడైన చక్రవర్తిగా శోభన్‌బాబు, లారీ డ్రైవర్ బాలగంగాధర తిలక్‌గా కృష్ణ నటించారు. ఢీ అంటే ఢీ అనుకొనే పాత్రలు వీరిద్దరివి. అద్భుతంగా నటించి, ఆ పాత్రలకు వన్నె చేకూర్చారు కృష్ణ, శోభన్‌బాబు. కృష్ణకు అద్భుతమైన డైలాగులు, శోభన్‌బాబుకు మంచి పాటలు కుదిరాయి. జయప్రద, శ్రీదేవి హీరోయిన్లుగా నటించారు.
రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నూతన్‌ప్రసాద్, ప్రభాకరరెడ్డి, అల్లు రామలింగయ్య, గిరిబాబు, శివకృష్ణ, సూర్యకాంతం, అన్నపూర్ణ .. ఇలా సినిమాలో చాలా పాత్రలు ఉన్నా అనవసరమైన సీన్లు లేకుండా, ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా కథను నడిపారు దర్శకుడు కె.బాపయ్య. కథ, కథనాల మీద దృష్టి పెట్టి నిర్మాత రామానాయుడు, దర్శకుడు బాపయ్య ప్రత్యేక దృష్టి పెట్టి ఇద్దరు హీరోలను సంతృప్తి పరుస్తూ ఈ సినిమా తీశారు. పరుచూరి సోదరులు రాసిన డైలాగులు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ‘ముందడుగు’ చిత్రం 18 కేంద్రాల్లో వంద రోజులు, 6 కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. ఈ సందర్భంగా 1983 ఆగస్టు 28న చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్లో రజతోత్సవం నిర్వహించారు రామానాయుడు. ఈ కార్యక్రమంలో జితేంద్ర, శక్తికపూర్, కృష్ణంరాజు, చిరంజీవి, మురళీ మోహన్, ఎమ్మెస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
