Chiranjeevi: ఎన్టీఆర్ క్లాప్‌తో మొదలైన.. చిరు సినిమా!
ABN , First Publish Date - 2022-08-27T05:06:57+05:30 IST
మెగాస్టార్ చిరంజీవితో ‘చట్టంతో పోరాటం’, ‘కొండవీటి రాజా’, ‘మంచి దొంగ’, ‘ఘరానా మొగుడు’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తీసిన నిర్మాత దేవి వరప్రసాద్ చిరంజీవితో తీసిన కాస్ట్లియస్ట్ మూవీ అల్లుడా మజాకా. ఇండస్ర్టీ హిట్ సినిమా ‘ఘరానా మొగుడు’ తర్వాత మళ్లీ చిరంజీవితోనే సినిమా తీస్తాను ఈలోపు మరే హీరోతో తీయను అని గట్టిగా నిర్ణయించుకొని, ఆ విషయాన్ని ప్రకటించిన గట్స్ ఉన్న నిర్మాత దేవి వరప్రసాద్.

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో ‘చట్టంతో పోరాటం’, ‘కొండవీటి రాజా’, ‘మంచి దొంగ’, ‘ఘరానా మొగుడు’ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తీసిన నిర్మాత దేవి వరప్రసాద్ చిరంజీవితో తీసిన కాస్ట్లియస్ట్ మూవీ అల్లుడా మజాకా. ఇండస్ర్టీ హిట్ సినిమా ‘ఘరానా మొగుడు’ తర్వాత మళ్లీ చిరంజీవితోనే సినిమా తీస్తాను ఈలోపు మరే హీరోతో తీయను అని గట్టిగా నిర్ణయించుకొని, ఆ విషయాన్ని ప్రకటించిన గట్స్ ఉన్న నిర్మాత దేవి వరప్రసాద్(Devi vara prasad). మీ టర్మ్ వచ్చినప్పుడు మళ్లీ డేట్స్ ఇస్తాను అప్పటి వరకూ మీరు ఖాళీగా ఉండడం ఎందుకు? వేరే హీరోతో సినిమా తీయండి నిర్మాత అన్న తర్వాత అందరి హీరోలతో పని చెయ్యాలి అని చిరంజీవి అనునయంగా చెప్పినా దేవి వరప్రసాద్ వినిపించుకోలేదు. చిరంజీవి డేట్స్ కోసం రెండున్నర సంవత్సరాలు వెయిట్ చేసి, నిర్మించిన చిత్రం అల్లుడా మజాకా(Alluda majaka). మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు ఈవివి సత్యనారాయణ (EVV Satyanarayana) పనిచేసిన ఏకైక చిత్రం ఇదే. ఈ అవకాశం కూడా ఆయనకు అనుకోకుండా లభించింది. తను దర్శకత్వం వహించిన అప్పుల అప్పారావు చిత్రం కాపీని చూపించడానికి చిరంజీవిని పిలిచారు ఇవివి. ఆయనతో పాటు దేవి వరప్రసాద్ కూడా వచ్చి ఆ సినిమా చూశారు. ఆ మర్నాడు ఇవివికి కబురు పెట్టారు దేవి వరప్రసాద్. అప్పుడు ఘరానా మొగుడు చిత్రం నిర్మాణంలో ఉంది. బడ్జెట్ పరిమితులు లేకుండా మీరు మా బేనర్ కు ఓ సినిమా చేసి పెట్టాలి.. అని అడిగారు దేవి వరప్రసాద్. చిరంజీవి ఆ చిత్రంలో నటిస్తారు అని కూడా చెప్పారు. ఊహించని అవకాశం అది. ఇవివి మనసు ఆనందంతో గంతులు వేసింది. అయితే చిరంజీవి వంటి అగ్ర హీరోతో సినిమా అంటే మాటలు కాదు. ఆయన ఇమేజ్‌కు తగిన మంచి కథ దొరకాలి. అందుకే రెండేళ్లు వెయిట్ చేశారు ఇవివి. కథ దొరకగానే చిరంజీవికి, దేవి వరప్రసాద్‌కు వినిపించారు. సింగిల్ సిట్టింగ్‌లోనే వారిద్దరూ కథ ఓకే చేశారు. (Ntr clap For Alluda majaka)
‘అల్లుడా మజాకా’ చిత్ర కథకుడు పోసాని కృష్ణమురళి. ఘరానా అత్తకు, గడుసు అల్లుడికి మధ్య జరిగే టీజింగ్ డ్రామా ఈ సినిమా. ఇందులో అత్త పాత్రకు మొదట వాణిశ్రీ పేరు పరిశీలించారు. అయితే ఆమె డేట్స్ కుదరక పోవడంతో మరో సీనియర్ హీరోయిన్ లక్ష్మిని అత్త పాత్రకు ఎంపిక చేశారు. హీరోయిన్లుగా రమ్య కృష్ణ, రంభ నటించారు. మెగాస్టార్ సరసన రంభ నటించిన తొలి సినిమా ఇదే. ‘అల్లుడా మజాకా’ చిత్రం షూటింగ్ సరిగ్గా ఇదే రోజున అంటే ఆగస్ట్ 26, 1994న నటరత్న ఎన్టీఆర్ చేతుల మీదుగా మొదలైంది. ఈ చిత్ర నిర్మాత కె దేవీ వరప్రసాద్ ఎన్టీఆర్ సన్నిహితుడు కావడం తో ఆయన కోరిక మేరకు ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరై తొలి క్లాప్ ఇచ్చారు. సంజీవయ్య పార్క్‌లో జరిగినఈ కార్యక్రమానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. 1995 ఫిబ్రవరి 25న విడుదలై విజయం సాధించింది.
– వినాయకరావు