అల్లరి హిట్!
ABN , First Publish Date - 2022-08-28T06:38:38+05:30 IST
హీరోలందరిది ఒక బాణీ అయితే, డాక్టర్ మంచు మోహన్‌బాబు రూట్ మాత్రం వేరు. అందరూ చేసే రొటీన్ హీరో పాత్రలను ఆయన కూడా చేయగలరు.

హీరోలందరిది ఒక బాణీ అయితే, డాక్టర్ మంచు మోహన్‌బాబు రూట్ మాత్రం వేరు. అందరూ చేసే రొటీన్ హీరో పాత్రలను ఆయన కూడా చేయగలరు. కానీ కొన్ని టిపికల్ రోల్స్ మాత్రం మోహన్ బాబు మాత్రమే చెయ్యగలరు. ఆ విషయాన్ని మరోసారి నిరూపించిన చిత్రం ‘అల్లరి మొగుడు’. కామెడీ, యాక్షన్ కలగలిపిన చిత్రం ఇది. అంతే కాదు మోహన్‌బాబు కు ఇదే తొలి సినిమా స్కోప్ చిత్రం కూడా. ‘అల్లరి మొగుడు’ చిత్రంలో రమ్యకృష్ణ, మీనా హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ అంతకుముందు ‘అల్లుడుగారు’ చిత్రంలో మోహన్‌బాబు సరసన నటించారు. ఆ రోజుల్లో ఆమెది ఐరెన్ లెగ్ అనీ, ఆమె నటించిన సినిమా ఆడదనీ అనేవారు. ఈ కారణంగా కొన్ని సినిమాల్లో ఆమెను మధ్యలోనే తీసేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇదంతా తెలిసినా ఆమెకు ‘అల్లుడుగారు’ చిత్రంలో మంచి అవకాశం ఇచ్చారు నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు రాఘవేంద్రరావు. రిజల్ట్ ఎలా ఉంటుందా అని ఆ సినిమా విడుదలయ్యేవరకూ టెన్షన్‌తో గడిపారు రమ్యకృష్ణ. ‘అల్లుడుగారు’ హిట్ కావడంతో రమ్యకృష్ణ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మీనా బాలనటిగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘జస్టిస్ చౌదరి’ హిందీ చిత్రంలో నటించింది. హీరోయిన్ అయ్యాక ఆయన దర్శకత్వంలో ఆమె నటించిన తొలి సినిమా ‘అల్లరి మొగుడు’. 1992 ఫిబ్రవరి 14న విడుదలైన ‘అల్లరి మొగుడు’ చిత్రం సూపర్ హిట్ అయింది. అంతవరకూ నిర్మాతగా విజయం ఎరుగని రాఘవేంద్రరావు ఈ సినిమాతో తొలి విజయం పొందారు. నిర్మాతగా రాఘవేంద్రరావుకు ఇక హిట్ రాదనీ, బయట బేనర్లో మోహన్‌బాబుకు సూపర్ హిట్ రావడం కష్టం అని ప్రచారం చేసిన వాళ్ల నోళ్లూ మూయించింది ‘అల్లరి మొగుడు’.