లతా మంగేష్కర్ సుమధుర గీతమాల
ABN , First Publish Date - 2022-02-06T17:12:54+05:30 IST
లతా మంగేష్కర్ ఏడు దశాబ్దాలకు పైగా సినీ సంగీత లోకాన్ని తన మధుర గాత్రంతో ఓలలాడించారు. ఆమె పాడిన వేల పాటల్లోని కొన్ని ఆణిముత్యాలు ఇవి ....

లతా మంగేష్కర్ ఏడు దశాబ్దాలకు పైగా సినీ సంగీత లోకాన్ని తన మధుర గాత్రంతో ఓలలాడించారు. ఆమె పాడిన వేల పాటల్లోని కొన్ని ఆణిముత్యాలు ఇవి ....
ఏ ఆయేగా... ఆనేవాలా
(చిత్రం: ‘మహల్’ – 1949, సంగీతం: ఖేమ్‌చంద్ ప్రకాశ్)
ఈ పాటలోని పల్లవీ చరణాలు ఎంత హృద్యంగా ఉంటాయో, సాకీ అంతకంటే హృద్యంగా ఉంటుంది. అంతకు ముందు శాస్త్రీయ సంగీతానికే పరిమితమైన వారు కూడా ఈ సాకీ పల్లవుల సమాగమాన్ని చూసి పరవశించిపోయారు. పాట స్వరరచనకు లతా మంగేష్కర్ గాత్రంలో వేయి సోయగాలు పోతుంది.
ఏ ఔరత్ నే జనమ్ దియా మర్దోంకో
(‘సాధన’–1958, దత్తానాయక్ )
పురుషాధిక్య సమాజంలో స్త్రీ ఎంత క్రూరంగా అణచివేతకు గురవుతుందో తెలిపే పాట ఇది. ‘భావోక్తంగా పాటడంలో లత అంత శ్రద్ధ చూపరు’ అని కొంత మంది విమర్శిస్తుంటారు. ఈ పాటతో ఆ విమర్శలకు గట్టిగా బదలిచ్చినట్లు అయ్యింది.
ఏ తుమ్హీ మేరీ మందిర్, తుమ్హీ మేరీ పూజ
(‘ఖాన్దాన్’– 1965, రవి)
ప్రేయసీ ప్రియులు కావచ్చు. జీవన సహచరులు కావచ్చు. ఒక మహోద్విగ్న స్థితిలో, ఒకరికి ఒకరు దైవంలా కనిపిస్తారు. ఆ స్థితిలో ఒకరినొకరు ప్రేమించడమే కాదు... ఒకరికొకరు దేవాలయాలవుతారు. ఆ ఆరాధనను గొంతులో నిండుగా పలికించడం ద్వారా లత కోటానుకోట్ల రసహృదయుల నీరాజనాలు అందుకున్నారు.
ఏ ఆప్ కీ నజ్రోఁనే సమ్‌ఝా ప్యార్‌కీ ఖాబిల్ ముఝే
(‘అన్పఢ్’– 1962, మదన్ మోహన్)
ఈ పాటలో లతలోని ఒక విశేష గాత్ర సౌలభ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా, చరణాన్ని అంత తారస్థాయిలో ఆలపించి, ఆ వెంటనే మంద్రంగా పల్లవిని అందుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. పాటను హోరెత్తించే తన సహజశక్తితో పాటు, స్త్రీలోని నిర్మలత్వాన్ని కూడా ఆ పాటలో ఆమె ఒలికించారు.

ఏ ఛోడ్ దే సారీ దునియా కిసీకే లియే
(‘సరస్వతీ చంద్ర’– 1968, కల్యాణ్‌జీ–ఆనంద్జీ)
ప్రేయసీ ప్రియులు ఒకరికొకరు దూరం అయితేనే అని కాదు, ఆత్మీయులు తమ ప్రాణ సమానులైన వాళ్లను కోల్పోవడం ఎంత విషాదం. అలాంటి విషాద స్థితిలో కాస్తంత ఆత్మస్థైర్యాన్ని, ఓదార్పునూ ఇచ్చే పాటలు చాలా అరుదుగానే ఉన్నాయి. ఆ అరుదైన పాటల్లో ఇదొకటి. గుండె బరువెక్కిన ప్రతి ఇంటా ఈ పాట ద శాబ్దాలుగా మారుమోగుతోంది.
ఏ సత్యం శివం సుందరం
(‘సత్యం– శివం– సుందరం’– 1978, లక్ష్మీకాంత్–ప్యారేలాల్)
రాజ్‌కపూర్ దర్శకత్వంలో వచ్చిన ‘సత్యం–శివం–సుందరం’ సినిమా పెద్దగా ఆడకపోయినా, లత పాడిన ఈ పాట గుండె గుండెలో ప్రతిధ్వనించింది. గుడిలోని ఒక సేవకురాలు రోజూ ఉదయం ఆ పురప్రజల్ని మేలుకొల్పేందుకు పాడే పాట ఇది. ఆకాశం చిల్లులు పడుతుందేమో అన్నంతగా గొంతెత్తి పాడే ఈ పాట ఆఽధ్యాత్మిక జీవుల్లో ఒక చెరగని ముద్రగా మిగిలిపోయింది.
ఏ యే మేరే వతన్ కే లోగో
(ప్రైవేట్ సాంగ్–1963, సి. రామచంద్ర)
ఇదొక ప్రైవేట్ గీతం. 1962లో జరిగిన భారత, చైనా యుద్దం ముగిసిన తర్వాత, అమరవీరుల సంస్మరణార్థం డిల్లీలో ఒక సభ జరిగింది. రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ సభలో అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్నారు. లతా మంగేష్కర్ సభలో ఈ పాట పాడగా విన్న నెహ్రూ వేదిక పైనే కంటతడి పెట్టుకున్నారు.

ఏ ప్యార్ కియాతో డర్నా క్యా
(‘మొఘల్–ఎ–ఆజమ్’– 1960, నౌషాద్)
పాట పల్లవి మాత్రమే వింటే అదేదో హుషారైన రొమాంటిక్ సాంగ్లా అనిపిస్తుంది. పల్లవి దాకా పాడే తీరు కూడా అలాగే ఉంటుంది. కానీ, చరణాల్లోకి వెళ్లాక గానీ అధి ధిక్కార నాదమని స్ఫురించదు. పాడటంలో అంతటి వైవిధ్యాన్ని చూపారు లత. ఆరు దశాబ్దాల క్రితం ప్రాణం పోసుకున్న ఈ పాట ఈనాటికీ శ్రోతల హృదయాల్లో మారుమోగడానికి ఇదో బలమైన కారణం.
ఏ కహీ దీప్ జలే, కహీ దిల్
(‘బీస్సాల్ బాద్’– 1962, హేమంత్ కుమార్)
లతా మంగేష్కర్ కన్నా ముందున్న గాయనీమణుల్లో అంత ఉచ్ఛస్వరంలో పాడ గలిగే వారు లేరనే చెప్పాలి. ‘కహీ దీప్ జలే’ పాటలో లత స్వరం ఆకాశపు అంచుల్ని తాకుతుంది. అది పుట్టుకతో వచ్చిన గాత్ర ధర్మం అనుకుంటే పొరపాటే అవుతుంది. నిరంతరమైన సాధన వల్ల సాధించింది మాత్రమే!
ఏ యే మేరె దిలే నాదా తూ గమ్ సే న ఘబ్రానా
(‘టవర్ హౌస్’– 1962, రవి)
హాయిగొలిపేవి, హుషారెత్తించేవి, హోరెత్తించేవి... ఇలాంటి వేల పాటలు మనకు ఎప్పుడూ వినపడుతూనే ఉంటాయి. కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్నీ, దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పునూ ఇచ్చే పాటలు చాలా అరుదు. అలాంటి అరుదైన పాటల్లో ‘యే మేరె దిలే నాదాఁ’ ఒకటి. ఈ పాటలోని భావుకతను మరింత హృద్యంగా, ఆర్ధ్రంగా పాడటంలో లత అద్భుతమైన పరిణతి చూపుతారు.
ఏ తూ జహాఁ జహాఁ చలేగా
(‘మేరా సాయా’ – 1966, మదన్ మోహన్)
‘నువ్వు ఎటు వెళ్లినా సరే నా నీడ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది’ అనే భావంతో ఈ పాట సాహిత్యం ఉంటుంది. ఆ భావాన్ని స్వరబద్ధం చేయడానికి సంగీత దర్శకుడు మదన్మోహన్ పడ్డ శ్రమ కూడా తక్కువేమీ కాదు. కానీ అంతకు ఎన్నో రె ట్లు లత శ్రమించారు. అందుకే 5 ద శాబ్దాలుగా ఈ పాట శ్రోతల హృదయాల్లో మారుమోగుతూనే ఉంది.
