ఆమే నా స్ఫూర్తి
ABN , First Publish Date - 2022-05-15T06:08:42+05:30 IST
‘దబాంగ్’ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ కథానాయిక సాయి మంజ్రేకర్.

‘దబాంగ్’ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ కథానాయిక సాయి మంజ్రేకర్. ఇటీవలే ఆమె తెలుగులో ‘గని’తో పాటు ‘మేజర్’ చిత్రంలోనూ నటించింది. సినిమాల్లోకి రాలేకపోయి ఉంటే.. టీచర్ అయ్యేదాన్ని అంటోన్న సాయి మంజ్రేకర్ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘‘దబాంగ్-3 చిత్రంలో అవకాశం రావటం అదృష్టమే. అది కూడా సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా ఎంపిక కావటంతో ఎగిరి గంతేశా. అయితే మా నాన్న మహేష్ మంజ్రేకర్ యాక్టర్, స్ర్కీన్ రైటర్, నిర్మాత కూడా. హిందీ, తెలుగు సినిమాల్లో పేరున్న యాక్టర్. అయితే యాక్టింగ్ ఫ్యామిలీ అని నాకు అవకాశం రాలేదు. ఆడిషన్ ద్వారానే ఎంపికయ్యా. ఏదేమైనా తొలి సినిమాతోనే సల్మాన్ జోడీగా నటించటంతో గుర్తింపు దక్కింది. సల్మాన్ నా మెంటర్. ఆయనతో కలిసి పని చేసినన్నాళ్లూ రోజులే తెలియలేదు. అదో మంచి ప్రయాణం.
టీచర్ అయ్యేదాన్ని..
ఇండస్ర్టీలో.. అదికూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చాలా ఉంది. అయితే ఎవరి ప్రతిభ వారిది. ఒకరితో ఒకరిని పోల్చలేం. నాకు నేను నిరూపించుకున్నప్పుడే నాకోసం పాత్రలు పుడతాయి. అసలు వాస్తవానికి సినిమాల్లోకి రావటానికి స్ఫూర్తి అలియా భట్. అలియా కెరీర్ చూశాక ముచ్చటేసింది. అలియా హార్డ్‌వర్క్, ప్రతిభ అద్భుతం. అందుకే ఆమె బాలీవుడ్ స్టార్ అయింది. ఒకవేళ నటిని కాకపోయి ఉంటే.. లెక్కల టీచర్ లేదా లిటరేచర్ టీచర్ అయ్యేదాన్ని. నాకు చదువు నేర్పించటం అంటే అంత ఇష్టం.
అదే నా బలహీనత..
నేను ఫన్నీ, కేరింగ్ పర్సన్‌ను. చిన్న చిన్న జ్ఞాపకాలను పోగు చేసుకోవటం ఇష్టం. నాకోసం నేను సమయం తీసుకుంటా. ఒంటరిగా ఎంజాయ్ చేస్తా. ఖాళీ దొరికితే సినిమాలు చూడటం, వంట వండటం చేస్తాను. స్నేహితులతో కలసి డ్రైవ్‌కి వెళ్లటం చాలా ఇష్టం. నన్ను నేను ప్రశ్నించుకోవటం రాదు. అదే నా బలహీనత. అయితే నా పక్కన ఉండే వాళ్లను మాత్రం హ్యాపీగా ఉంచుతా. జోక్స్‌తో నవ్విస్తా. ఇక నా ఫిలాసఫీ ‘ఈట్ ప్రే లవ్’. ఇకపోతే సమకాలీన ప్రపంచంలో ప్రతి రోజూ పత్రిక, టీవీల్లో ఎన్నో క్రైమ్, విషాద వార్తలు వస్తుంటాయి. వాటిని పట్టించుకోను. ఆనందకరమైన విషయాలే చదువుతా. జాయ్‌ను స్ర్పెడ్ చేసినపుడు మనం మంచి స్థితికి వెళ్తామని నమ్మకం.’’