గుర్తుపట్టలేని అవతారంలో పరుచూరి వెంకటేశ్వరరావు.. షాకవుతోన్న నెటిజన్లు
ABN , First Publish Date - 2022-03-13T03:01:12+05:30 IST
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రచయితలుగా టాలీవుడ్ కీర్తికిరీటంలో వారి పేరు ప్రథమస్థానంలో ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేనే లేదు. రచయితలుగానే కాకుండా

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రచయితలుగా టాలీవుడ్ కీర్తికిరీటంలో వారి పేరు ప్రథమస్థానంలో ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేనే లేదు. రచయితలుగానే కాకుండా నటులుగానూ వారిరువురు అనేక చిత్రాలలో నటించి.. మంచి పేరు గడించారు. దాదాపు మూడు తరాల హీరోలతో పనిచేసిన అనుభవం వారిది. ఇప్పటికీ వారిలో పదును తగ్గలేదని ఇటీవల వచ్చిన 'సైరా' చిత్రంతో నిరూపించుకున్నారు. కళామతల్లి ముద్దు బిడ్డలుగా ఈ అన్నదమ్ములు కళకు ఎంతో సేవ చేశారు.. చేస్తున్నారు. అయితే వీరిలో పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పరుచూరి పాఠాలు అంటూ ప్రతీ వారం పలకరిస్తూనే ఉంటారు. ఆయనకి అన్నయ్య అయినటువంటి పరుచూరి వెంకటేశ్వరరావు మాత్రం కనిపించేది చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో ఆయన ఏ సినిమా వేడుకకు హాజరుకాలేదు. తాజాగా దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఆయనతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలలో పరుచూరి వెంకటేశ్వరరావుని చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
దీనికి కారణం ఆయన అవతారం గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఆయన పరుచూరి వెంకటేశ్వరరావు అంటే ఎవరూ నమ్మను కూడా నమ్మరు. ఎందుకంటే పరుచూరి వెంకటేశ్వరరావు అంటే.. ప్రేక్షకులకి ఒక డైలాగుని విడమరిచి చెబుతున్నట్లుగా కనిపించే రూపమే గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఫొటోలలో వృద్ధాప్య దశకు తను చేరుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 78 సంవత్సరాలు. అయితే వెంకటేశ్వరరావు కంటే 2 సంవత్సరాల చిన్నవాడైన గోపాలకృష్ణలో మాత్రం ఈ తరహా వృద్దాప్యం కనిపించదు. ఆయన యాక్టివ్గానే పాఠాలు చెబుతున్నారు. ఇక తన గురువుగారైన పరుచూరి వెంకటేశ్వరరావుని కలుసుకున్నందుకు చాలో సంతోషంగా ఉందని, కానీ ఆయన వృద్ధాప్య స్థితిని చూసి బాధేసిందని దర్శకుడు జయంత్ సి పరాన్జీ వెల్లడించారు.

ఇన్స్టాగ్రమ్ వేదికగా పరుచూరి వెంకటేశ్వరరావుతో ఉన్న ఫొటోలను షేర్ చేసిన జయంత్ సి పరాన్జీ.. ''మా గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావుగారిని ఇలా చూసి కొంచెం బాధనిపించింది. కానీ ఆయన మైండ్ మాత్రం ఎప్పటిలానే చాలా చురుకుగా ఉంది. పరుచూరి బ్రదర్స్ ఇద్దరూ 300కి పైగా చిత్రాలకు రచయితగా పని చేశారు. వాటిలో 200కు పైగా చిత్రాలు బ్లాక్బస్టర్ విజయం సాధించాయి.. లవ్ యు సార్" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.