‘షోయూ’: నాగచైతన్య సరికొత్త ప్రయాణం
ABN , First Publish Date - 2022-03-05T00:16:01+05:30 IST
యువ సామ్రాట్ నాగచైతన్య ‘షోయూ’ అంటూ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. హీరోగా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న నాగచైతన్య ఇప్పుడు అనేక రకాల రుచికరమైన జపనీస్ వంటకాలతో సహా పాన్-ఏషియన్ వంటకాలను తెలుగువారికి..

యువ సామ్రాట్ నాగచైతన్య ‘షోయూ’ అంటూ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. హీరోగా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్న నాగచైతన్య ఇప్పుడు అనేక రకాల రుచికరమైన జపనీస్ వంటకాలతో సహా పాన్-ఏషియన్ వంటకాలను తెలుగువారికి రుచి చూపించబోతున్నారు. ఈ విషయం నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. క్లౌడ్ కిచెన్ విధానంలో పనిచేయనున్న ‘షోయు’ వంటకాలను హైదరాబాద్‌లోని కస్టమర్స్‌కు స్విగ్గీ ద్వారా అందుబాటులో ఉంటాయని, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా స్థిరమైన ప్యాకేజింగ్ విధానంతో ‘షోయూ’ వంటకాలు పంపిణీ చేయబడతాయని చైతూ ప్రకటించారు.
‘షోయు’ లాంచ్ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘నా హృదయానికి ఆహారం చాలా ప్రత్యేకమైనది. అందుకే ప్రపంచమంతా ప్రయాణించి అత్యుత్తమ వంటకాలను అనుభవించే అవకాశం లభించింది. నాకు ఇష్టమైన పనిచేసే అవకాశాన్ని ‘షోయు’ కల్పించింది. ఈ బ్రాండ్ ప్రారంభించే ముందు వెనుక ఎంతో వర్క్ చేయడం జరిగింది. స్విగ్గీ ద్వారా ఈ వంటకాలను మీ ఇంటికే చేర్చుతాం. మీరంతా ఈ ఆహారాన్ని రుచి చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను..’’ అని తెలిపారు. కాగా.. నిగిరిస్, థాయ్ కర్రీస్, సూప్స్, రైస్, నూడుల్స్ వంటి మరెన్నో పాన్ ఏషియన్ వంటకాలు ‘షోయు’లో లభించనున్నాయి.