Kollywood: స్టార్ హీరోలంతా బిజీ బిజీ
ABN , First Publish Date - 2022-11-26T19:40:53+05:30 IST
కోలీవుడ్ (Kollywood)లో అగ్రహీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య, ధనుష్, విశాల్, కార్తీ, శివకార్తికేయన్ వంటివారు తమతమ కొత్త చిత్రాల షూటింగుల్లో..

కోలీవుడ్ (Kollywood)లో అగ్రహీరోలైన రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య, ధనుష్, విశాల్, కార్తీ, శివకార్తికేయన్ వంటివారు తమతమ కొత్త చిత్రాల షూటింగుల్లో బిజీబిజీగా ఉన్నారు. కమిట్ అయిన చిత్రం షూటింగ్ పూర్తయ్యేంత వరకు మరో కొత్త చిత్రానికి సంతకం చేయకుండా, ఒప్పందం చేసుకున్న చిత్రాలను పూర్తి చేసేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద హీరోలు నటిస్తున్న చిత్రాల వివరాలను పరిశీలిస్తే...
రజనీకాంత్ (Rajinikanth):
రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ (Jailer) చిత్రం దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. చెన్నై నగర శివారు ప్రాంతంలోని స్టూడియోలో జైలు సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు టీమ్ హైదరాబాద్‌కు రానుంది. ఆ తర్వాత తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించే చిత్రంలో రజనీ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
కమల్ హాసన్ (Kamal Haasan):
‘విక్రమ్’ (Vikram) తర్వాత కొన్నేళ్ళ క్రితం ఆగిపోయిన ‘ఇండియన్-2’ (Indian 2) చిత్రాన్ని తిరిగి పట్టాలెక్కించి శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఆ తర్వాత మణిరత్నం (Mani Rathnam) దర్శకత్వంలో నటించనున్నారు. అలాగే, ఉదయనిధి నిర్మించే చిత్రానికి కమిట్ అయ్యారు. నిర్మాతగా శివకార్తికేయన్‌తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు.

అజిత్ కుమార్ (Ajith Kumar):
హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘తుణివు’ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది, ఆ తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించనున్నారు.
విజయ్ (Vijay):
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘వారిసు’ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో నటించనున్నారు.

విక్రమ్ (Vikram) - సూర్య (Suriya)
హీరో విక్రమ్ దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కించే ‘తంగలాన్’ చిత్రంలో నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. హీరో సూర్య బాలా దర్శకత్వంలో ‘వనంగాన్’ మూవీలో నటిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా, శివ దర్శకత్వంలో మరో మూవీలో నటించనున్నారు.

ధనుష్ (Dhanush) - ఎస్.కె (Sivakarthikeyan)
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘వాత్తి’ చిత్రంలో నటించిన ధనుష్.. ఇపుడు అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా చేస్తున్నారు. శివకార్తికేయన్ ‘మావీరన్’, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ (Vishal), రాజా మురుగన్ దర్శకత్వంలో కార్తీ (Karthi) నటిస్తున్నారు.
