అన్నయ్య చెబితే కళ్లుమూసుకోని చేసేయవచ్చు

ABN , First Publish Date - 2022-09-28T11:51:47+05:30 IST

నటనపై ఉన్న ఇష్టం, ఎంతకైనా కష్టించే తత్వం... ఇవి రెండే సత్యదేవ్‌ను నటుడిగా నిలబెట్టాయి. చిన్న పాత్రలతో కెరీర్‌ మొదలైనా, అనతికాలంలోనే...

అన్నయ్య చెబితే కళ్లుమూసుకోని చేసేయవచ్చు

నటనపై ఉన్న ఇష్టం, ఎంతకైనా కష్టించే తత్వం... ఇవి రెండే సత్యదేవ్‌ను నటుడిగా నిలబెట్టాయి.  చిన్న పాత్రలతో కెరీర్‌ మొదలైనా, అనతికాలంలోనే ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశారు. జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న సత్యదేవ్‌ ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రంలో చిరంజీవితో కలసి తెరను పంచుకున్నారు. ఈ చిత్రం అక్టోబరు 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్‌ పంచుకున్న విశేషాలు. 


చిరంజీవి అన్నయ్య మెగాస్టార్‌ అవడానికి ఎంత కష్టపడ్డారో సెట్‌లో చూస్తే తెలిసింది. ఆయన చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఉల్లాసంగా ఉంటారు. సెట్‌ అంతటా తిరుగుతూ అన్నీ చూసుకుంటారు. డైలాగ్‌ ్స ప్రిపేరవుతారు. ఆయన ఇచ్చే సలహా, సూచనకి 45 ఏళ్ల అనుభవం ఉంది. అందుకే అన్నయ్య చెబితే కళ్లుమూసుకోని చేసేయవచ్చు. ఫలితం తెరపై కనిపిస్తుంది. 


అన్నయ్య ఒకరోజు లంచ్‌కి పిలిచారు. వెళ్లాక సినిమా కథ చెబుతున్నారు. అన్నయ్య నాకు కథ చెప్పడం ఏంటని ఆశ్చర్యంగా చూస్తున్నాను. ‘నాకేం అర్థం కావడం లేదన్నయ్యా, మీరు నాకు సినిమా  కథ చెప్పడం ఏమిటి?. మీరు చేయమంటే ‘గాడ్‌ఫాదర్‌’లో చేసేస్తాను’ అని చెప్పాను. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. ‘ఈ సినిమా మాతృక చూశావా’ అని అడిగారు. ‘చూడలేదు... చూడకుండానే చేసేస్తాను’ అన్నాను. 


నటిస్తున్నప్పుడు మాత్రం ఆ పాత్రలో చాలా లోతు ఉందని అర్థమైంది. చిన్న టెన్షన్‌ కూడా మొదలైంది. చిత్రీకరణ సమయంలో అన్నయ్య నన్ను బాగా ఎంకరేజ్‌ చేశారు. ఆయన షాట్‌ అయ్యాక కూడా నాకు సాయం చేసేందుకు నా పక్కనే ఉండేవారు. ఒక నటుడిగా అన్నయ్య నాపైన ఉంచిన బాధ్యతను నెరవేర్చాలనుకున్నాను. 


అన్నయ్య గ్రేస్‌కి సరిపడే కథ ఇది. ఆయన లుక్‌ కూడా పూర్తిగా మార్చారు. ఇంటర్వెల్‌ ముందు వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ‘థార్‌మార్‌...’ పాట అదిరిపోతుంది. మా ఇద్దరి మధ్య ఎత్తుకు పై ఎత్తు అన్నట్లు కథ సాగుతుంది. అన్నయ్యతో సినిమా క్లైమాక్స్‌లో 14 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోతుంది. 


సల్మాన్‌ఖాన్‌ పెద్ద స్టార్‌ అయినా సెట్‌లో చాలా కూల్‌గా ఉంటారు. మోహన్‌రాజా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయన చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఇందులో నా పాత్రని చాలా స్టైలి్‌షగా తీర్చిదిద్దారు. 


మంచి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను. సోలో హీరోగా చేస్తూనే నన్ను ఎగ్జయిట్‌ చేసే పాత్రలు వచ్చినా చేస్తాను. ‘గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, రామ్‌సేతు’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఫుల్‌బాటిల్‌’ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను.

Updated Date - 2022-09-28T11:51:47+05:30 IST