అప్పుడు ట్రైన్లో నుంచి దూకి చచ్చిపోదామనుకున్నా : నటి
ABN , First Publish Date - 2022-02-11T20:34:09+05:30 IST
మరాఠీ సినిమాలతో నటిగా కెరీర్ ప్రారంభించి అనంతరం హృతిక్ రోషన్ ‘సూపర్ 30’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్...

మరాఠీ సినిమాలతో నటిగా కెరీర్ ప్రారంభించి అనంతరం హృతిక్ రోషన్ ‘సూపర్ 30’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మృణాల్ ఠాకూర్. అనంతరం ఈ బ్యూటీ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ భామ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
మృణాల్ మాట్లాడుతూ.. ‘ఎవరి జీవితంలోనైనా 15, 20 సంవత్సరాల మధ్య వయసు చాలా కష్టతరమైంది. ఎందుకంటే అది వారికేం కావాలో తెలుసుకునే వయసు. అంతేకాకుండా ఆ టైమ్‌లో ఎన్నో రకాల సవాళ్లను ఎదుర్కొంటారు. కొన్నిసార్లైతే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. నేను చదువుకునే రోజుల్లో లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసేదాన్ని. అప్పుడు ఎక్కువగా డోర్ దగ్గర నిలబడాల్సి వచ్చేది. ఆ సమయంలో ట్రైన్లో నుంచి దూకేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది.
ఈ తార ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి నా తల్లిదండ్రులు నేను డెంటిస్ట్ అవ్వాలనుకున్నారు. కానీ నేను దానికి విరుద్ధంగా మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేశాను. అనంతరం సినిమా రంగంలోకి వచ్చాను. అయితే ఇక్కడ కెరీర్ విజయవంతంగా ఉంది కాబట్టి పర్లేదు. ఒకవేళ పెయిల్యూర్ అయి ఉంటే 23 ఏళ్లకే పెళ్లి చేసుకొని, పిల్లలను కనేదాన్నేమో. కానీ అది నాకు ఇష్టం లేదు. నేను ఏదైనా సాధించాలని, సమాజంలో నాకంటూ ఓ గుర్తింపు ఉండాలని కోరుకున్నాను’ అంటూ తెలిపింది.