అదో అశ్లీల సినిమా.. దీపిక మూవీపై కంగన వివాదాస్పద కామెంట్స్
ABN , First Publish Date - 2022-02-13T15:42:12+05:30 IST
బాలీవుడ్లో కంగన రనౌత్‌కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా వివిధ అంశాలపై చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో..

బాలీవుడ్లో కంగన రనౌత్‌కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా వివిధ అంశాలపై చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవలే కర్ణాటక హిజాబ్ వివాదంపై కామెంట్స్ చేసిన ఈ భామ.. తాజాగా బీ టౌన్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే సినిమాపై విమర్శలు చేసింది.
ప్రముఖ దర్శకుడు శకున్ బత్రా దర్శకత్వంలో దీపిక పదుకొనే నటించిన తాజా చిత్రం ‘గెహ్రాయాన్’. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ ఈ మూవీలో కో స్టార్ సిద్ధాంత్ చతుర్వేదితో చేసిన రొమాంటిక్ సీన్లలో కలిసి రెచ్చిపోయింది. దీంతో ఈ మూవీపై కంగన తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది.
కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్టోరీలో మనోజ్ కుమార్ సినిమా ‘హిమాలయ కి గాడ్ మై’లోని ఛాంద్ సి మెహబూబా సాంగ్‌ని షేర్ చేసింది. దానికి.. ‘నేనూ నవతరానికి చెందిన వ్యక్తినే కానీ ఇలాంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలను. దయచేసి మిలీనియల్/న్యూ ఏజ్/ అర్బన్ సినిమాల పేరుతో చెత్తను అమ్మకానికి పెట్టకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలే. స్కిన్ షో లేదా అశ్లీలత వాటిని ఏ మాత్రం కాపాడలేవు. ఇది అంతలోతైన (హిందీలో గెహ్రాయాన్) విషయం ఏం కాదు. చాలా ప్రాథమిక అంశం’ అంటూ రాసుకొచ్చింది.
ఇందులో కంగన డైరెక్ట్‌గా దీపికా పేరును తీసుకురాలేదు. అయితే ఆమె ఉపయోగించిన ‘గెహ్రాయాన్’ అనే పదాన్ని బట్టి అది దీపికనే అంటోందని ఎవరికైనా అర్థం అవుతోంది. కాగా ఈ కామెంట్‌పై దీపిక కానీ, ఆ మూవీ టీం కానీ స్పందిస్తుందేమో చూడాలి..
