ఏ విషయంలోనూ నో రిగ్రెట్స్!: రాజా రవీంద్ర
ABN , First Publish Date - 2021-06-06T05:30:00+05:30 IST
రాజా రవీంద్రతో మాట్లాడుతూ ఉంటే చిన్నప్పటి స్నేహితుడితో ముచ్చట్లు చెప్పుకున్నట్లు ఉంటుంది. చెన్నై,

రాజా రవీంద్రతో మాట్లాడుతూ ఉంటే చిన్నప్పటి స్నేహితుడితో ముచ్చట్లు చెప్పుకున్నట్లు ఉంటుంది. చెన్నై, హైదరాబాద్‌లాంటి నగరాల వాసన ఏ మాత్రం అంటని అరుదైన మనిషి అనిపిస్తుంది. 700కు పైగా సినిమాల్లో నటించిన రాజా రవీంద్ర అన్ని అర్హతలు ఉండి కూడా ఒక పెద్ద హీరో ఎందుకు కాలేకపోయారు? చిరంజీవి, మోహన్‌బాబు వంటి సీనియర్లకే కాకుండా నిఖిల్, రాజ్ తరుణ్, మంచు విష్ణు వంటి ఈ తరం నటులకు కూడా సన్నిహితుడు ఎలా అయ్యారు? రాజీవ్‌గాంధీ ముందు కూచిపూడి ప్రదర్శన ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు డ్యాన్స్ ఎందుకు మానేశారు? లాంటి ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలంటే రాజా రవీంద్రతో ఈ ఇంటర్వ్యూ చదవాల్సిందే..
‘‘నా అసలు పేరు రమేష్. మాది భీమవరం. మా పెదనాన్న భూపతిరాజు విజయకుమారరాజు- ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన పేరున్న రాజకీయ నాయకుడు. అనేక వ్యాపారాలు కూడా ఉండేవి. చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ గడిపిన జీవితం నాది. ఎందుకో కచ్చితంగా చెప్పలేను కానీ- చిన్నప్పుడే నాకు కూచిపూడి అంటే ఆసక్తి కలిగింది. డ్యాన్స్ నేర్చుకున్నా.. అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చా. నేను చదివే సమయంలో ఢిల్లీలో అంతర్జాతీయ యువజన పోటీలు జరిగాయి. దీనిలో అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ తరపున నేను ఒకో మెట్టు ఎక్కుతూ ఫైనల్స్‌కు వచ్చా.
ఢిల్లీలో రాజీవ్‌గాంధీ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శన కూడా ఇచ్చా. నాకు ఒకవైపు డ్యాన్స్ అంటే ఇష్టమే ఉన్నా- పెదనాన్న గారి పేపరు మిల్లు.. దాని వ్యవహారాలు అన్నా ఆసక్తే. అందుకే ఇంటర్ పూర్తయిన వెంటనే పెదనాన్నగారి పేపర్ వ్యాపారానికి సంబంధించిన మార్కెటింగ్ విభాగంలో చేరిపోయా! పగలు ఉద్యోగం చేసేవాడిని. రాత్రి నైట్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశా! ‘‘నీకు డ్యాన్స్ అంటే ఇష్టం కదా.. చెన్నై వెళ్తే అక్కడ డ్యాన్స్ నేర్చుకోవచ్చు.. అదే సమయంలో వ్యాపారం కూడా చూసుకోవచ్చు’’ అని పెదనాన్న అనటంతో మద్రాసుకు షిఫ్ట్ అయిపోయా. డ్యాన్స్ నేర్చుకోవటానికి వెంపటి చినసత్యంగారి దగ్గర చేరా. అప్పట్లో ప్రముఖ నటి ప్రభ గారు కూడా ఆయన దగ్గరే నేర్చుకుంటూ ఉండేవారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి.
మద్రాసుకు వెళ్లిన తర్వాత కూడా నేను నటుడిని అవ్వాలనే కోరిక ఉండేది కాదు. నేను.. నా ఉద్యోగం.. నా డ్యాన్స్.. అలా రోజులు గడిపేసేవాడిని. వెంపటి చినసత్యం గారి దగ్గర కేశవ మాస్టర్ ఉండేవారు. ఆయన మాకు క్లాసులు తీసుకుంటూ ఉండేవారు. ఆయన దగ్గరకు ఒక రోజు ‘ఈనాడు’ లాంటి సినిమాలు తీసిన ప్రముఖ దర్శకుడు సాంబశివరావుగారి అసిస్టెంట్ డైరక్టర్ వచ్చాడు. నన్ను చూసి- ‘‘నువ్వు బావున్నావు.. మా డైరక్టర్‌గారు కొత్త యాక్టర్లను వెతుకుతున్నారు.. రేపు రా!’’ అన్నాడు.
సరదాగా సాంబశివరావుగారి దగ్గరకు వెళ్లా. ఆయన నన్ను ప్రముఖ ఫొటోగ్రాఫర్ మధు అంబట్ గారికి చూపించారు. ఆయన కూడా ఓకే చేసిన తర్వాత రేవతి గారికి పరిచయం చేశారు. ఆవిడ కూడా ఒకే చేసిన తర్వాత నన్ను హీరోగా పెట్టి ‘మృగతృష్ణ’ అనే సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమాతోనే నా పేరు రవీంద్రగా మారింది. దానికి కూడా ఒక కథ ఉంది. సాంబశివరావుగారు హీరో కృష్ణ గారి కుటుంబానికి సన్నిహితుడు.
అప్పటికే కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ సినిమాల్లో ఉన్నాడు. అదే పేరుతో ఇంకొకరిని పరిచయం చేయలేరు కాబట్టి నా ముద్దు పేరు రవీంద్రను స్ర్కీన్ నేమ్‌గా మార్చారు. ఇక తమిళంలోకి వెళ్లినప్పుడు అక్కడ రవీంద్ర పేరు మీద మరో ప్రముఖ నటుడు ఉన్నాడు. అందువల్ల ఇళయరాజా.. భాగ్యరాజాలా.. రవీంద్రరాజా అని పేరు పెట్టుకుందామనుకున్నా. కానీ ఆ పేరు బాలేదనిపించి- రాజా రవీంద్ర అని పెట్టుకున్నా. అలా నా పేరు రాజారవీంద్రగా స్థిరపడిపోయింది. ఎన్ఎఫ్డీసీ సహకారంతో తీసిన ‘మృగతృష్ణ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. కానీ థియేటర్లలో మాత్రం విడుదల కాలేదు. అయినా ఈ సినిమా ద్వారా నేను ఉన్నాననే విషయం ఇండస్ట్రీకి తెలిసింది.
నాయుడు గారి సహకారం..
‘మృగతృష్ణ’ సినిమాలో నన్ను చూసి రామానాయుడు గారు ఆయన తీసిన ‘సర్పయాగం’ సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు. ఇక ఆ తర్వాత నేను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈ సందర్బంలో పరుచూరి బ్రదర్స్‌ను కూడా తప్పనిసరిగా తలుచుకోవాలి. ‘సర్పయాగం’ నుంచి అనేక సినిమాల్లో మంచి మంచి వేషాలు రావటానికి పరుచూరి బ్రదర్స్ కారణం. ఒక వైపు తెలుగులో చేస్తూనే తమిళ సినిమాలు కూడా చేయటం మొదలుపెట్టా. ‘పెదరాయుడు’ తమిళ్ వెర్షన్... ‘భలే పెళ్లాం’ తమిళవెర్షన్ల వల్ల నాకు తమిళనాడులో మంచి గుర్తింపు వచ్చింది. రజనీకాంత్ నటించిన ‘పడియప్ప’ (తెలుగులో ‘నరసింహ’)కు ప్రశంసలు అందుకున్నా.
ఒక దశలో నేను తెలుగులో కన్నా తమిళంలో బాగా పాపులర్ అయ్యా. చాలా మంది నన్ను తమిళియన్ అనుకొనేవారు. నేను ఈ చిత్రాల్లో నటిస్టున్నప్పుడే చిరంజీవి, మోహన్‌బాబు, రజనీకాంత్ వంటి అగ్రహీరోలతో సన్నిహిత పరిచయం ఏర్పడింది. వీరందరిలో అద్బుతమైన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్లే వారు లెజెండ్స్ అయ్యారు. నన్ను వీరందరూ తమ కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు పూర్తవుతోంది. వీరితో కలిపి అనేక చిత్రాల్లో నటించా.
అయినా ఇప్పటికీ నాకు వీరిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. షూటింగ్లో కూడా వాళ్లను చూస్తూ ఉండిపోతా! ఈ మధ్యనే ‘ఆచార్య’ షూటింగ్లో చిరంజీవి గారిని కళ్లార్పకుండా చూస్తుంటే ఆయన తిట్టారు కూడా! బహుశా హీరోలను ఆరాధనతో చూసే స్వచ్ఛమైన పల్లెటూరి వాసనలు నాలో ఇంకా పోలేదేమో.
నటులకు మెంటరింగ్!
డ్యాన్స్.. మార్కెటింగ్.. నటన.. ఇలా నా జీవితంలో రకరకాల పాత్రలు పోషించినా- నటన అంటే నాకు ఎందుకో తెలియని ఇష్టం. ఎంత ఇష్టమంటే షూటింగ్ లేకపోతే ఏదో వెలితి ఫీలవుతూ ఉంటా. నాకు షూటింగ్ లేకపోయినా స్పాట్‌కు వెళ్లి కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే- ‘నేను నా నట జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదా’ అనిపిస్తుంది. నేను ఒక వైపు నటిస్తూనే మరో వైపు యంగ్ హీరోల డేట్స్‌ను కూడా చూడటం మొదలుపెట్టా. ప్రస్తుతం నిఖిల్, రాజ్‌తరుణ్, మంచు విష్ణుల డేట్స్ నేనే చూస్తా. ఈ యంగ్ హీరోలకు సినిమా మీద ఉన్న ప్రేమ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్లందరికీ సినిమానే జీవితం.
షూటింగ్ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ సినిమాకు సంబంధించిన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. రాజ్‌తరుణ్ స్ర్కిప్ట్‌లు రాస్తాడు. కొత్త కొత్త సినిమాలు చూస్తూ ఉంటాడు. నిఖిల్ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు ఫాలో అవుతూ ఉంటాడు. మంచు విష్ణు రోజూ ఏదో ఒక కొత్త సినిమా చూస్తూనే ఉంటాడు. బయట నుంచి చూసేవాళ్లకు హీరోలు, హీరోయిన్లు పెద్దగా కష్టపడరు.. సుఖ జీవితాలను గడుపుతూ ఉంటారనిపిస్తుంది. కానీ ఒక్కసారి వారి జీవితాలలోకి చూస్తే- సినిమాల కోసం ఎంత జీవితాన్ని కోల్పోతున్నారో అర్థమవుతుంది.
చివరిగా...
‘‘ఒక పెద్ద హీరో కావటానికి అవసరమైన లక్షణాలన్నీ నీకున్నాయి.. అయినా కమర్షియల్ హీరో ఎందుకు కాలేకపోయావు’’ అని కొందరు అడుగుతూ ఉంటారు. బహుశా నేను నా కెరీర్‌ను అంత సీరియస్‌గా తీసుకోకపోవటం ఒక కారణం కావచ్చు. అయినా నాకు ఈ విషయంలో ఎటువంటి రిగ్రెట్స్ లేవు. నాకు ఇష్టమైన నటనను ఇంకా కొనసాగిస్తున్నా. అంత కన్నా ఏం కావాలి? హైదరాబాద్‌లో నేను ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా.
అమ్మ, మా అత్తయ్య, మామయ్య- మా దగ్గరే ఉంటారు. మా ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు కూడా మా ఇంటి పక్కనే ఉంటాయి. ప్రతి రెండు రోజులకు అందరం కలుస్తూనే ఉంటాం. నేను రమణ మహర్షి ఫాలోయర్ని. అందువల్ల నాకు కావాల్సిన మానసిక ప్రశాంతత ఆయన అందిస్తూ ఉంటారు. నిరంతరం ఏదో ఒక విషయానికి ఆందోళన చెందుతూ ఉండటం కన్నా ఆ ప్రశాంతతే ముఖ్యమని నేను గాఢంగా నమ్ముతా!’’

కలిసిచేద్దాం..
నాకు ఒకప్పుడు డ్యాన్స్ అంటే ప్రాణం. తర్వాత డ్యాన్స్ చేయటం మానేశా. ప్రముఖ నటి, నర్తకి ప్రభ నా సహాద్యాయి. అప్పుడప్పుడు ఆమె- ‘‘నువ్వు డ్యాన్స్ మానేస్తే ఎలా.. మళ్లీ ప్రాక్టీసు చేయి.. మనిద్దరం కలిసి చేద్దాం’’ అంటూ ఉంటారు.

పెద్దన్నయ్య మోహన్‌బాబు!
‘‘మోహన్‌బాబును ‘పెద్దన్నయ్య’ అని పిలుస్తా. తను క్రమశిక్షణకు మారుపేరు. ‘పెదరాయుడు’ సినిమా సమయంలో నేను తమిళంలో బిజీగా ఉన్నా. ఎందుకైనా మంచిదని ఎక్కువ రోజులు డేట్స్ తీసుకున్నారు. దీనితో చాలా కాలం తనతో కలిసి పనిచేశా. ఆ సమయంలో ఏర్పడిన సాన్నిహిత్యం ఇప్పటికీ కొనసాగుతోంది.’’

షాట్ అంటే చాలు..
‘‘చిరంజీవిని ‘అన్నయ్య’ అని పిలుస్తా. ‘స్నేహం కోసం’ షూటింగ్ సమయంలో తనతో సాన్నిహిత్యం ఏర్పడింది. తనను చూస్తే ఇప్పటికీ కళ్లప్పగించి చూస్తూ నిలబడిపోతా. అంత ఆరాధన నాకు. తనతో షూటింగ్ అంటే చాలా సరదాగా ఉంటుంది. షూటింగ్లో ఉన్నప్పుడు- ‘షాట్ రెడీ’ అని మైకులో వినిపిస్తే చాలు- తాగుతున్న కాఫీ కూడా పక్కన పెట్టి వెళ్లిపోతారు.
ఒక మెగాస్టార్ రేంజిలో ఉన్న వ్యక్తి అలా చేయాల్సిన అవసరమే లేదు. ఆయన ఎప్పుడు వెళ్తే అప్పుడే షూటింగ్ మొదలవుతుంది. అయినా అలా చేయరు. ‘షాట్ రెడీ’ అని విని వెళ్లి.. ‘‘మీ షాట్ కాదు సార్’’ అని చెప్పిన తర్వాత తిరిగి వచ్చేసిన సందర్భాలెన్నో. కొత్తతరం హీరోలు కొందరు పిలుపు వచ్చిన తర్వాత కూడా వెళ్లరు. అక్కడే నిలబడి కబుర్లు చెబుతూ ఉంటారు. వారి కోసం యాభై, అరవై మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వారిని చూస్తే బాధ కలుగుతూ ఉంటుంది.

కెమెరా పక్కనే రజనీ
‘‘రజనీకాంత్ తన షాట్ ఉన్నా లేకపోయినా లొకేషన్‌ను విడిచి బయటకు వెళ్లరు. కెమెరా వెనక నిలబడి మిగిలిన నటులు ఎలా నటిస్తున్నారో చూస్తూ ఉంటారు. క్లోజప్‌లో షాట్స్ తీసినప్పుడు ఇతర నటుల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో, వాటికి తాను ఎలా రియాక్ట్ అవ్వాలో ఆలోచిస్తూ ఉంటారు. రజనీకాంత్, శివాజీగారు కలిసి నటిస్తున్నప్పుడు చూస్తే- ఆ సన్నివేశాలు ఎప్పటికీ మరచిపోలేం! ఒకరికి పోటీగా మరొకరు నటిస్తూ ఉంటారు. రజనీకాంత్ ఇప్పటికీ కో-డైరక్టర్ వస్తే లేచి నిలబడతారు. డైరక్టర్స్ అంటే ఆయనకు అంత గౌరవం. ఆయన షూటింగ్‌కు వస్తే ఒక్క అసిస్టెంట్ ఉంటాడంతే! షూటింగ్ మధ్యలో అతనే టచప్ చేసి వెళ్లిపోతాడు. ఎటువంటి హంగామా, ఆర్భాటం ఉండదు.’’
