ఓటీటీలో విడుదలకు సిద్ధమయిన మలయాళం ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమా

ABN , First Publish Date - 2021-11-11T00:02:08+05:30 IST

సరికొత్త కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మలయాళం ఇండస్ట్రీలో ఒక సినిమా చర్చను లేవనెత్తుతోంది. ఆ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం ఓటీటీలో విడుదల కావడమే అందుకు కారణం.

ఓటీటీలో విడుదలకు సిద్ధమయిన మలయాళం ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమా

సరికొత్త కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మలయాళం ఇండస్ట్రీలో ఒక సినిమా చర్చను లేవనెత్తుతోంది. ఆ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం ఓటీటీలో విడుదల కావడమే అందుకు కారణం. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మరక్కార్‌: అరేబియా సముద్ర సింహం’.  ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఆంటోని పెరంబవూర్‌ నిర్మించారు. 


‘‘ ఈ సినిమా కోసం ఆంటోని తన దగ్గర ఉన్న డబ్బంతా వెచ్చించారు. తన జీవితాన్ని తాకట్టు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్‌లాల్, నా మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కోసం నేను, మోహన్‌లాల్ పారితోషికంగా ఒక రూపాయి కూడా తీసుకోలేదు. మూవీ నుంచి వచ్చే లాభాల్లో వాటా తీసుకోవడానికి అంగీకరించాం. గత రెండు ఏళ్లుగా ఆయన భారీ స్థాయిలో వడ్డీలను కడుతున్నారు. ఈ సినిమాను థియేటర్లల్లో విడుదల చేయాలని చూస్తే నిర్మాత తీవ్రమైన ఇబ్బందుల్లో పడతారు. ఒక వేళ సినిమా థియేటర్లల్లో విడుదలయ్యి విజయం సాధించినా కూడా ఆంటోనికి తీవ్ర స్థాయిలో నష్టాలు వస్తాయి. మేం ఆయనను ఆ స్థితిలో చూడలేం. అందువల్లే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నాం ’’ అని చిత్ర దర్శకుడైన ప్రియదర్శన్ తెలిపారు. కానీ, ఏ ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారన్న విషయాన్ని ఇప్పటి వరకు దర్శక, నిర్మాతలు ప్రకటించలేదు.


అర్జున్‌, కీర్తిసురేశ్‌, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ ఇలా భారీ తారాగణం నటించిన ‘మరక్కార్’ 2019లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలకు దాదాపు ఏడాది సమయం పట్టింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 2020లో విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది. కరోనాతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించటంతో అప్పటి నుంచి ‘మరక్కార్‌’ విడుదల వాయిదా పడుతూ వస్తుంది.

Updated Date - 2021-11-11T00:02:08+05:30 IST