రేర్ పిక్: ‘శత్రువు’ శతదినోత్సవంలో..
ABN , First Publish Date - 2021-07-31T22:33:16+05:30 IST
తన కుమారుడు సుమంత్ అశ్విన్ పేరు మీద సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి, నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించిన తొలి చిత్రం ‘శత్రువు’. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. కోడి రామకృష్ణ దర్శకుడు. విజయశాంతి హీరోయిన్. ఎమ్మెస్ రాజు చిన్నప్పటి నుంచి

తన కుమారుడు సుమంత్ అశ్విన్ పేరు మీద సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి, నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించిన తొలి చిత్రం ‘శత్రువు’. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. కోడి రామకృష్ణ దర్శకుడు. విజయశాంతి హీరోయిన్. ఎమ్మెస్ రాజు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ మాస్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే ఆయనలో హాలీవుడ్ సినిమాల ప్రభావం కూడా ఉంది. అది శత్రువు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎమ్మెస్ రాజు అభిరుషికి తగ్గట్లుగా స్టయిలిష్‌గా ఆ సినిమా రూపొందించారు కోడి రామకృష్ణ. ఈ సినిమా స్టోరీ ఐడియా ఎమ్మెస్ రాజుదే. రచయిత సత్యమూర్తితో కూర్చుని కథ తయారు చేశారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. అలాగే వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ ‘బొబ్బిలి రాజా’తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇవి రెండూ ఎమ్మెస్ రాజుకు బాగా కలిసొచ్చాయి.
రివర్స్ స్ర్కీన్‌ప్లేతో ‘శత్రువు’ సినిమా రూపుదిద్దుకొంది. అప్పటివరకూ తెలుగు సినిమాలకు పెద్దగా అలవాటు లేని ఈ ఫార్మాట్‌ను ‘శత్రువు’తో అలవాటు చేశారు ఎమ్మెస్ రాజు. 1991 జనవరి 2న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఎమ్మెస్ రాజుకు సంక్రాంతి సెంటిమెంట్ ఈ చిత్రంతోనే మొదలైంది. ఈ చిత్ర శతదినోత్సవంలో కళాతపస్వి కె. విశ్వనాధ్ చేతుల మీదుగా వెంకటేష్ జ్ఞాపికను అందుకున్నారు.
-వినాయకరావు
