చిరంజీవితో అనుకొని వెంకటేశ్‌తో తీశారు
ABN , First Publish Date - 2021-12-20T23:35:47+05:30 IST
తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘అణ్ణామలై’. తెలుగులో రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటించిన ‘ప్రాణ స్నేహితులు’ చిత్రాన్ని కాస్త అటుఇటు మార్చి, తమిళంలో తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ఆ సమయంలో తెలుగులో రీమేక్ చిత్రాల హవా నడుస్తుండడంతో ‘అణ్ణామలై’ హక్కుల కోసం తెలుగు నిర్మాతలు పోటీ పడ్డారు.

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘అణ్ణామలై’. తెలుగులో రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటించిన ‘ప్రాణ స్నేహితులు’ చిత్రాన్ని కాస్త అటుఇటు మార్చి, తమిళంలో తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ఆ సమయంలో తెలుగులో రీమేక్ చిత్రాల హవా నడుస్తుండడంతో ‘అణ్ణామలై’ హక్కుల కోసం తెలుగు నిర్మాతలు పోటీ పడ్డారు. చివరకు నిర్మాత కేవీవీ సత్యనారాయణ హయ్యెస్ట్ ప్రైజ్ కోట్ చేసి, రీమేక్ హక్కులు పొందారు. మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్న ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో తీస్తే బాగుంటుందని సత్యనారాయణ ఆలోచన. అదే సమయంలోనే విక్టరీ వెంకటేశ్‌తో ‘సుందరకాండ’ చిత్రం నిర్మిస్తున్నారు కేవీవీ. ఆ సినిమా పూర్తయ్యేలోపు చిరంజీవిని కలిసి డేట్స్ సంపాదించాలని ఆయన ప్లాన్.
చెన్నై నుండి హైదరాబాద్‌లోకు కేవీవీ ఫ్లైట్‌లో వస్తుంటే లక్కీగా అదే విమానంలో చిరంజీవి కూడా ఉన్నారు. ఆయన తీరికగా కనిపించడంతో పక్కన కూర్చుని ‘అణ్ణామలై’ కథను, తన మనసులోని మాటను వినిపించారు కేవీవీ. చిరంజీవికి ఆ కథ బాగా నచ్చింది. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లాక తనని కలిస్తే డేట్స్ చెబుతాననీ, డైరెక్టర్ ఎవరనేది అప్పుడు ఫైనలైజ్ చేద్దామని చిరంజీవి చెప్పారు.
ఆనందంతో తబ్బిబ్బవుతూ ఎయిర్పోర్ట్ నుండి సరాసరి ‘సుందరకాండ’ షూటింగ్ జరిగే లొకేషన్‌కు వెళ్లారు కేవీవీ. ఆయన ‘అణ్ణామలై’ రీమేక్ రైట్స్ తీసుకున్నారనే సమాచారం వెంకటేశ్‌కు తెలిసింది. కేవీవీ షూటింగ్ స్పాట్‌లోకి అడుగుపెట్టగానే ‘అణ్ణామలై’ సినిమా కూడా మనమే చేద్దాం అని ఆయనతో చెప్పారు వెంకటేశ్. ఆ మాట విని షాక్ అయ్యారు కేవీవీ. ఎందుకంటే ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే అదే స్టార్‌తో కంటిన్యూ అవుతూ మరో సినిమా తీయడం చాలా అరుదైన సంఘటన. అదీ వెంకటేశ్ వంటి స్టార్ హీరోతో వెంటవెంటనే సినిమాలు చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. ఆ విషయానికి ఆనందించాలో, లేక నంబర్ వన్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ మిస్ అవుతున్నందుకు బాధపడాలో ఆ సమయంలో నిర్మాత సత్యనారాయణకు తెలియలేదు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో వెంకటేష్‌తో ఒక సినిమా చేస్తుండడంతో ఆయనతోనే ప్రొసీడ్ కాక తప్పలేదు కేవీవీకి. అలా ‘కొండపల్లి రాజా’ చిత్రం తెలుగులో మొదలైంది. సుమన్ మరో హీరో పాత్రను పోషించిన ఈ చిత్రంలో నగ్మా కథానాయిక. వెంకటేశ్, దర్శకుడు రవిరాజా పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన ‘చంటి’ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆయన్నే ఈ చిత్రానికి దర్శకుడిగా ఎన్నుకున్నారు.
–వినాయకరావు