చిరు-వర్మ చిత్రం అర్థాంతరంగా ఆగిపోవడానికి కారణమిదే!
ABN , First Publish Date - 2021-07-22T22:49:07+05:30 IST
కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన రామ్‌గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’ విడుదలై ఊహించని విజయం సాధించినప్పటి నుంచీ మెగాస్టార్ చిరంజీవి, వర్మ కాంబినేషన్లో సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నించారు. యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరూ కలిసి పని చేసే సినిమా

కింగ్ నాగార్జున హీరోగా రూపొందిన రామ్‌గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’ విడుదలై ఊహించని విజయం సాధించినప్పటి నుంచీ మెగాస్టార్ చిరంజీవి, వర్మ కాంబినేషన్లో సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నించారు. యూత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరూ కలిసి పని చేసే సినిమా తప్పకుండా నెక్ట్స్ లెవల్లో ఉంటుందనీ, బిజినెస్ పరంగా కూడా బాగా ప్లస్ అవుతుందనీ వాళ్ల అంచనా, ఆశ. అందుకే ఈ కాంబినేషన్ కలపాలని ప్రయత్నించారు కానీ ఎందువల్లో కుదర్లేదు. అయితే కాంబినేషన్స్ కలపడంలో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ దిట్ట కనుక ఆయన సాధించారు. మెగాస్టార్‌తో ఓ వెరైటీ చిత్రం చేయాలనే కోరిక వర్మలో ఉండడం, ఆ దర్శకునితో కలసి పని చేయాలనే ఆసక్తి చిరంజీవిలోనూ ఉండడం వల్ల అశ్వినీదత్ పని సులువైంది. ఆ సమయంలోనే ‘హిట్లర్’ చిత్రంలో నటించడానికి నిర్మాత ‘ఎడిటర్’ మోహన్‌కు డేట్స్ ఇచ్చారు చిరంజీవి. రామ్‌గోపాల్ వర్మ చెప్పిన సబ్జెక్ట్ నచ్చడంతో అశ్వినీదత్‌కు కూడా డేట్స్ కేటాయించారు. అంటే నెలలో 15 రోజులు ‘హిట్లర్’ చిత్రానికీ, మిగిలిన 15 రోజులు వర్మ చిత్రానికి పని చేయాలని ఆయన నిర్ణయించుకొన్నారు.
అదే సమయంలో సంజయ్ దత్, ఊర్మిళ జంటగా హిందీలో ‘దౌడ్’ చిత్రాన్ని తీస్తున్నారు వర్మ. ఆ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయింది కూడా. రెండో షెడ్యూల్ ప్రారంభించే సమయానికి సంజయ్ దత్ జైలుకు వెళ్లడంతో ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆయన ఎప్పుడు విడుదల అవుతారో తెలియని పరిస్థితుల్లో చిరంజీవి చిత్రాన్ని అంగీకరించారు వర్మ. 1996 ఆగస్టు 11న కర్నాటకలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. చిరంజీవి, హీరోయిన్ ఊర్మిళపై ఓ పాట, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఇంతలో సంజయ్ దత్‌కు బెయిల్ దొరికి జైలు నుంచి విడుదలయ్యారు. ‘దౌడ్’ సినిమా వెంటనే పూర్తి చేసి, ఆ తర్వాత చిరంజీవి చిత్ర షూటింగ్ ప్రారంభిద్దామని నిర్మాత అశ్వినీదత్‌కు చెప్పారు వర్మ. చిరంజీవికి ఈ విషయం చెప్పి, ఆయన అనుమతితో వర్మకు ఓకే చెప్పారాయన.
అలా వర్మ కోసం నెల.. రెండు నెలలు.. మూడు నెలలు ఓపికగా వెయిట్ చేశారు చిరంజీవి. అయినా ఎంతకీ ‘దౌడ్’ చిత్రం పూర్తి కాకపోవడం ఆయన సహనానికి పరీక్ష పెట్టిందని చెప్పాలి. ‘హిట్లర్’ చిత్రం షూటింగ్ ఓ పక్క పూర్తి కావస్తున్నా కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేని పరిస్థితి ఆయనది. ఇలా ఇంకా ఎంత కాలమో తెలియని ఈ వెయింటింగ్ వల్ల మెగాస్టార్ చేయాల్సిన ఇతర చిత్రాల ప్లానింగ్స్ దెబ్బతిన్నాయి కూడా. కేవలం ఒక వ్యక్తి కోసం, ఒక్క సినిమా కోసం నెలల తరబడి వెయిట్ చేస్తూ ఇతర నిర్మాతలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని చిరంజీవికి అనిపించింది. వెంటనే ఆయన కొత్త సినిమాలకు పచ్చ జెండా ఊపేశారు. చిరంజీవి, వర్మ కాంబినేషన్లో ఓ అద్భుత చిత్రం వస్తుందనే ఆశతో ఉన్న మెగాభిమానులు మాత్రం ఈ సినిమా ఇలా అర్థాంతరంగా ఆగిపోవడంతో చాలా బాధపడ్డారు.
-వినాయకరావు