పరిశ్రమను వణికించిన విమాన ప్రమాదం
ABN , First Publish Date - 2021-07-23T19:59:16+05:30 IST
ప్రపంచ చరిత్ర లో ఇంతవరకూ కనీవినీ ఎరుగని సంఘటన అది. ఒక ఎయిర్ బస్ గాల్లోంచి నేలకు ఒరిగినా, అందులోని 272 మంది ప్రయాణికుల్లో ఎవరికీ ఏమి కాలేదంటే అది దైవక్రుపే. చిన్న చిన్న దెబ్బలతో అంతా క్షేమంగా బయట పడ్డారు.

ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ కనీవినీ ఎరుగని సంఘటన అది. ఒక ఎయిర్ బస్ గాల్లోంచి నేలకు ఒరిగినా, అందులోని 272 మంది ప్రయాణికుల్లో ఎవరికీ ఏమి కాలేదంటే అది దైవ కృపే. చిన్న చిన్న దెబ్బలతో అంతా క్షేమంగా బయట పడ్డారు. అంతమంది ప్రయాణికులను, సిబ్బందిని ప్రమాదం అంచు నుంచి సురక్షితంగా కాపాడిన ఘనత కెప్టెన్ భల్లాదే.
ఈ సంఘటన జరిగిన రోజు 1993 నవంబర్ 15. మద్రాస్ నుంచి హైదరాబాద్ మీదుగా డిల్ల్లీ బయలుదేరి ప్రమాదానికి గురైన ఎయిర్ బస్ 272 మంది ప్రయాణికులతో ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బయలు దేరింది. కాక్ పిట్‌లో సీనియర్ పైలెట్ కెప్టెన్ భల్లా, కో పైలెట్ వెల్ రాజ్ ఉన్నారు. ప్రయాణికుల్లో 64 మంది తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. చిరంజీవి, బాలక్రిష్ణ, విజయశాంతి, మాలాశ్రీ, అల్లు రామలింగయ్య దంపతులు, సుధాకర్, బ్రహ్మానందం, కాస్టూమ్స్ కృష్ణ, దర్శకుడు బాపు, కోడి రామకృష్ణ, ఎస్ వి కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, ఎమ్.డి. సుందర్, నిర్మాతలు కె. సి. శేఖర్ బాబు, కాట్రగడ్డ ప్రసాద్, రాశీ మూవీస్ నరసింహారావు, నృత్య దర్శకురాలు సుచిత్ర, ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్, ఛాయాగ్రాహకుడు కె. ఎస్ హరి, అనుమోలు హరి, చిరంజీవి పర్సనల్ మేకప్‌మెన్ శివ తదితరులు ఉన్నారు.
నిజంగా అది విచిత్రమైన సంఘటనే. అన్ని వైఫల్యాలు ఓకే సారిన ఏర్పడ్డాయి. విమానం రెక్కలకు ఉండే ప్లాప్స్, స్లాట్స్ హైదరాబాద్ విమానాశ్రయం లో లాండింగ్ కోసం తెరుచుకొన్నవి, అక్కడ వాతావరణం అనుకూలంగా లేక లాండింగ్ కుదరక పోవడంతో పైకి ఎగిరే సమయంలో యధాస్థానంలోకి వెళ్ళాల్సినవి సాంకేతిక లోపం వల్ల వెళ్ళలేదు. బహుశా ఇండియన్ ఎయిర్ లైన్స్ చరిత్రలోనే ఇలాంటి సంఘటన జరగడం అదే మొదటి సారేమో. దీనివల్ల ఇంధనం ఖర్చు రెండింతలు కావడంతో తిరిగి మద్రాసుకు బయలుదేరిన విమానం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవడానికి కూడా ఇంధనం సరిపోని పరిస్థితి. అందుకే కెప్టెన్ భల్లా, కో పైలెట్ వేల్‌రాజ్, ఇంజినీర్ ేసన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంకటగిరి సమీపంలోని వెల్లంపాడు బట్టలపల్లి, గుండ్లపల్లి గ్రామాల మధ్య పొలాల్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. విమానం కొద్ది అడుగులు వెనుక దిగి ఉంటే పెద్ద చెరువులో పడేది. కొద్దిగా పక్కకు దిగినా పెద్ద రాతి మీద, కరెంట్ తీగల మీద పడి ఘోర ప్రమాదం జరిగి ఉండేది. విమానంలో ఒక్క దురదృష్టవంతుడు అక్కడున్న మొత్తం అందరినీ తీసుకు పోయేవాడే అని పలువురు ఆరోజు వ్యాఖ్యానించారు. నిజమే.. ఆ అదృష్టం తెలుగు చిత్ర పరిశ్రమది, ప్రేక్షకులది.
- వినాయకరావు
