అన్నగారితో పెట్టుకుంటే ఇక అంతే!
ABN , First Publish Date - 2021-11-30T02:46:14+05:30 IST
నటరత్న ఎన్టీఆర్ మంచి భోజనప్రియులు. షూటింగ్ స్పాట్లో ఉంటే ఆయనకు ఇంటి నుంచి భోజనం వచ్చేది. పండగ రోజున ఎన్టీఆర్ షూటింగ్లో మిగిలిన ఆర్టిస్టులకు పండగే! ఎందుకంటే ఆ రోజు ఆయనకు ఇష్టమైన బొబ్బట్లు, గుమ్మడికాయ పులుసు సహా..

నటరత్న ఎన్టీఆర్ మంచి భోజనప్రియులు. షూటింగ్ స్పాట్లో ఉంటే ఆయనకు ఇంటి నుంచి భోజనం వచ్చేది. పండగ రోజున ఎన్టీఆర్ షూటింగ్లో మిగిలిన ఆర్టిస్టులకు పండగే! ఎందుకంటే ఆ రోజు ఆయనకు ఇష్టమైన బొబ్బట్లు, గుమ్మడికాయ పులుసు సహా నాలుగైదు రకాల పిండి వంటలతో ఇంటి నుంచి క్యారియర్ వచ్చేది. ఆయనకే కాకుండా మరో పది మందికి సరిపోయేలా వండి పంపించేవారు ఆయన సతీమణి బసవతారకం.
‘గోపాలుడు-భూపాలుడు’ చిత్రంలోని ఒక సన్నివేశంలో ఎన్టీఆర్, రాజనాల తినడంలో పోటీ పడతారు. అందులో ఎన్టీఆర్ గెలుస్తారు. ఆ సన్నివేశం కోసం ఎన్టీఆర్, రాజనాల నిజంగానే పోటీపడి తిన్నారు. ఎన్టీఆర్ను ‘అల్లుడూ’ అని చనువుగా పిలిచేవారు రాజనాల. ఆ సన్నివేశం చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘అల్లుడూ ఇంతలా తిన్నావంటే నీ గ్లామర్ దెబ్బతింటుంది’ అన్నారు రాజనాల. ఆ రోజు నటుడు సత్యనారాయణకు వర్క్ లేదు. కానీ ఎన్టీఆర్ను కలవడం కోసం ఆ షూటింగ్కు వెళ్లారు. రాజనాల అలా అనగానే సత్యనారాయణ ఊరుకోకుండా ‘అవును అన్నగారు’ అన్నారు. ఎన్టీఆర్ అభిమానధనుడు కదా. మనసులో ఏమి అనిపించిందో కానీ పైకి మాత్రం ‘చూద్దాం బ్రదర్’ అన్నారు.
ఇది జరిగిన కొంత కాలానికి ఎన్టీఆర్ సొంత చిత్రం ‘ఉమ్మడి కుటుంబం’లో ఆయనకు అన్నయ్యకు నటించే అవకాశం సత్యనారాయణకు వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ పండగ వచ్చింది. ఎప్పటిలా ఐదారు రకాల పిండివంటలతో ఎన్టీఆర్కు ఇంటి నుంచి క్యారియర్ వచ్చింది. లంచ్ బ్రేక్ ఇవ్వగానే ‘బ్రదర్.. ఈ రోజు మాతో పాటు మీరు భోజనం చేస్తున్నారు’ అని సత్యనారాయణతో చెప్పారు ఎన్టీఆర్. ‘అన్నగారూ ఇక తినడం నా వల్ల కాదు’ అని సత్యనారాయణ అంటున్నా వినకుండా అన్ని వంటకాలు వడ్డించి, కడుపుబ్బి పోయేలా తినిపించారు ఎన్టీఆర్. ఆ రోజు ‘గోపాలుడు-భూపాలుడు’ షూటింగ్లో తను అన్నమాట గుర్తు పెట్టుకుని అన్నగారు ఇలా తినిపించారన్న విషయం సత్యనారాయణకు అప్పుడు కానీ అర్ధం కాలేదు.
-వినాయకరావు
