రాజశేఖర్ డాన్స్ చూసి ఆశ్చర్యపోయిన చిరంజీవి
ABN , First Publish Date - 2021-08-17T00:04:13+05:30 IST
పాటలు, స్టెప్స్ అంటే ఆమడ దూరంలో ఉండే రాజశేఖర్ ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మధుబాలతో స్టెప్స్ వేయడం చూసి ఆశ్చర్యపోని వారు లేరు. ‘రాజశేఖర్ ఇంత బాగా స్టెప్స్ వేయగలడా?’ అని మెగాస్టార్ చిరంజీవి సైతం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డాక్టర్ రాజశేఖర్ కాంబినేషన్లో ‘అల్లరి ప్రియుడు’ చిత్రాన్ని అనౌన్స్ చేయగానే అంతా ఆశ్చర్యపోయారు. వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందా? అని. ఎందుకంటే దర్శకుడిగా రాఘవేంద్రరావు స్కూల్ వేరు, హీరోగా రాజశేఖర్‌కు ఉన్న ఇమేజ్ వేరు. వీళ్లిద్దరిలో ఎవరు తమ రూట్ మార్చుకుంటారా అని ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల వారు కూడా ‘అల్లరి ప్రియుడు’ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. పాటల స్పెషలిస్ట్ అయిన రాఘవేంద్రరావు రూట్లోకే రాజశేఖర్ వెళ్లిపోయారు. యాంగ్రీ యంగ్మన్ పాత్రలతో ఆడియన్స్‌కు బాగా దగ్గరైన రాజశేఖర్లో లవర్ బోయ్ కోణాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారు రాఘవేంద్రరావు.
బాలీవుడ్లో మ్యూజికల్ హిట్ అయిన ‘సాజన్’ చిత్రం ఇన్స్పిరేషన్తో ‘అల్లరి ప్రియుడు’ రూపుదిద్దుకొంది. పాటలు, స్టెప్స్ అంటే ఆమడ దూరంలో ఉండే రాజశేఖర్ ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మధుబాలతో స్టెప్స్ వేయడం చూసి ఆశ్చర్యపోని వారు లేరు. ‘రాజశేఖర్ ఇంత బాగా స్టెప్స్ వేయగలడా?’ అని మెగాస్టార్ చిరంజీవి సైతం అనుకున్నారట. సినిమా చూసిన వెంటనే రాజశేఖర్‌కు ఫోన్ చేసి ఆయన అభినందనలు తెలిపారు కూడా. అంతేకాదు, ఆ చిత్ర 100 రోజుల ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరై.. తన చేతుల మీదుగా షీల్డ్‌లు అందజేశారు. ‘అల్లరి ప్రియుడు’ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, రాజశేఖర్ నట జీవితాన్ని ఆసక్తికరమైన మలుపు తిప్పిందని చెప్పాలి.
-వినాయకరావు