కమల్‌తో అనుకొని జగపతిబాబుతో తీశారు
ABN , First Publish Date - 2021-10-07T03:09:23+05:30 IST
‘అల్లరి ప్రియుడు’, ‘అల్లరి మొగుడు’ చిత్రాల విజయం తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన మరో ‘అల్లరి’ చిత్రం ‘అల్లరి ప్రేమికుడు’. రచయిత సత్యానంద్ ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఒక విశేషం. వ్యాపారవేత్త సురేశ్‌తో కలసి ఈ సినిమా..

‘అల్లరి ప్రియుడు’, ‘అల్లరి మొగుడు’ చిత్రాల విజయం తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన మరో ‘అల్లరి’ చిత్రం ‘అల్లరి ప్రేమికుడు’. రచయిత సత్యానంద్ ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఒక విశేషం. వ్యాపారవేత్త సురేశ్‌తో కలసి ఈ సినిమా ఆయన నిర్మించారు. ఇందులో హీరో పాత్రకు మొదట కమల్‌హాసన్‌ను.. దివ్యభారతి, మీనాలను హీరోయిన్లుగా అనుకొన్నారు. అయితే దివ్యభారతి ఆకస్మిక మరణంతో సినిమా సీన్ మారిపోయింది. మరో హీరోయిన్ మీనా డేట్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో అప్పుడు సౌందర్య, రంభలను ఎంపిక చేశారు. ఇద్దరు హీరోయిన్లతో అనుకొన్న కథలో మార్పులు జరగడంతో మరో కథానాయిక అవసరమైంది. అప్పుడు మూడో హీరోయిన్ పాత్రకు నూతన నటిని కాంచన్‌ను ఎంపిక చేశారు. ముగ్గురు హీరోయిన్ల కథకు కమల్ కంటే లేడీస్‌లో బాగా ఫాలోయింగ్ ఉన్న జగపతిబాబు బెటర్ అనిపించింది దర్శకేంద్రుడికి.
కట్ చేస్తే జగపతిబాబు హీరోగా 1993 డిసెంబర్ 31న రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అల్లరి ప్రేమికుడు’ షూటింగ్ మొదలైంది. దర్శకరత్న దాసరి నారాయణరావు తొలి క్లాప్ ఇచ్చి షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకొన్న చిత్రం ఇదే! సౌందర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించిన తొలి చిత్రం ఇదే. అలాగే ముగ్గురు హీరోయిన్లతో పాటు అతిథి పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించారు. జగపతిబాబు, నలుగురు హీరోయిన్లతో 1994 మే 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ కరువైంది.
-వినాయకరావు
