కిళ్లీ షాప్ ఓనర్‌కు ఉంగరాలు ఉండకూడదా?: అసోసియేట్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్
ABN , First Publish Date - 2021-09-26T00:26:17+05:30 IST
షూటింగ్ తొలి రోజున ఎన్టీఆర్ మేకప్‌తో రెడీ అయి, సెట్లోకి అడుగుపెట్టారు. పంచె, లాల్చీ, మెడలో ఓ టవల్, రెండు చేతులకు ఉంగరాలు.. ఇదీ ఆయన గెటప్. ఎన్టీఆర్ కిళ్లీ షాప్ ఓనర్‌గా నటిస్తున్నారు. పాన్ షాప్ ఓనర్లు అంత రిచ్ కాదు కనుక చేతులకు ఉంగరాలు

ఆ రోజుల్లో ఎన్టీఆర్‌తో ఎక్కువ చిత్రాలు నిర్మించిన సంస్థల్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిల్మ్స్ ఒకటి. ఆ సంస్థ అధినేత మిద్దే జగన్నాథరావు. ఎన్టీఆర్ హీరోగా ‘నిండు హృదయాలు’, ‘నిండు మనసులు’, ‘నిండు దంపతులు’, ‘కలిసొచ్చిన అదృష్టం’ వంటి చిత్రాలను నిర్మించారు. వీటిల్లో ‘నిండు హృదయాలు’ చిత్రంలో ఎన్టీఆర్ కిళ్లీ షాప్ ఓనర్ రాములుగా నటించారు. ఆయనకు జోడీగా విజయనిర్మల నటించారు. ఎన్టీఆర్ పాన్ షాప్‌కు ఎదురుగా ఉండే కాకా హోటల్ సుబ్బులు పాత్ర ఆమె పోషించారు. ‘నిండు దంపతులు’ చిత్రానికి కథకుడు, దర్శకుడు కె. విశ్వనాథ్.
ఈ చిత్రం షూటింగ్ తొలి రోజున ఎన్టీఆర్ మేకప్‌తో రెడీ అయి, సెట్లోకి అడుగుపెట్టారు. పంచె, లాల్చీ, మెడలో ఓ టవల్, రెండు చేతులకు ఉంగరాలు.. ఇదీ ఆయన గెటప్. ఎన్టీఆర్ కిళ్లీ షాప్ ఓనర్‌గా నటిస్తున్నారు. పాన్ షాప్ ఓనర్లు అంత రిచ్ కాదు కనుక చేతులకు ఉంగరాలు ఉండకూడదు.. ఇదీ ఆ సినిమా అసోసియేట్ డైరెక్టర్ ఆలోచన. అందుకే దర్శకుడు విశ్వనాథ్‌ను సంప్రదించకుండా డైరెక్ట్‌గా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి, ‘సార్.. ఈ సినిమాలో మీది కిళ్లీ షాప్ ఓనర్ పాత్ర. ఇలా రెండు చేతులకు ఉంగరాలు ఉండకూడదు సార్’ అన్నారు. తన లాజిక్‌ను ఎన్టీఆర్ మెచ్చుకుని అభినందిస్తారని ఆ అసోసియేట్ డైరెక్టర్ ఆశించాడు. మరొకరు అలా అడిగితే ఎన్టీఆర్ ఆగ్రహించే వారేమో కానీ ఆ అసోసియేట్ డైరెక్టర్ తనకు సన్నిహితుడు కావడంతో కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతో ‘మీరు ఎప్పుడన్నా బెజవాడ వెళ్లి కిళ్లీ షాప్ ఓనర్లను చూశారా’ అని ప్రశ్నించారు. లేదన్నాడు ఆ అసోసియేట్ డైరెక్టర్. ‘ఒకసారి వెళ్లి చూడండి బ్రదర్. కిళ్లీ షాప్ ఓనర్ల చేతికి ఉంగరాలు ఉంటాయో లేదో.. ’ అన్నారు ఎన్టీఆర్. ఇంకా ఆ అసోసియేట్ డైరెక్టర్ మరేమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేశాడు. అంతే కాదు ఇంకెప్పుడూ ఎన్టీఆర్ గెటప్ విషయంలో అతను కామెంట్ చేయలేదు.
-వినాయకరావు