‘మా బంగారక్క’: స్టూడియో రూమ్స్‌లోనే సర్దుకున్నారు
ABN , First Publish Date - 2021-09-29T01:01:55+05:30 IST
తన కెరీర్ ప్రారంభ దశలో దర్శకుడు దాసరి నారాయణరావు హైదరాబాద్‌లో తీసిన చిత్రాల్లో ‘మా బంగారక్క’ ఒకటి. ఆ రోజుల్లో అక్కినేని నటించే అన్ని చిత్రాలు, ఎన్టీఆర్ సొంత సినిమాలు హైదరాబాద్‌లోనే తయారయ్యేవి. మిగిలిన హీరోల చిత్రాల షూటింగ్స్ చెన్నైలోనే జరిగేవి. ‘మా బంగారక్క’ చిత్ర..

తన కెరీర్ ప్రారంభ దశలో దర్శకుడు దాసరి నారాయణరావు హైదరాబాద్‌లో తీసిన చిత్రాల్లో ‘మా బంగారక్క’ ఒకటి. ఆ రోజుల్లో అక్కినేని నటించే అన్ని చిత్రాలు, ఎన్టీఆర్ సొంత సినిమాలు హైదరాబాద్‌లోనే తయారయ్యేవి. మిగిలిన హీరోల చిత్రాల షూటింగ్స్ చెన్నైలోనే జరిగేవి. ‘మా బంగారక్క’ చిత్ర నిర్మాత సునీల్ చౌదరి అంతకుముందు దాసరి దర్శకత్వంలో శోభన్‌బాబు హీరోగా నిర్మించిన ‘బలిపీఠం’ షూటింగ్ చెన్నైలోనే జరిగింది. మరి ‘మా బంగారక్క’ షూటింగ్ హైదరాబాద్‌లో జరగడానికి కారణం? హైదరాబాద్, అందులోనూ తమ సారథీ స్టూడియోలో షూటింగ్ చేస్తే తప్ప ఈ సినిమాను పంపిణీ చేయమని నవయుగ ఫిల్మ్స్ అధినేతలు కండిషన్ పెట్టారు. అప్పటికే అన్నపూర్ణ, రామకృష్ణ స్టూడియోలు హైదరాబాద్‌లో మొదలయ్యాయి. దీనివల్ల సారథీ స్టూడియోలో షూటింగ్స్ తగ్గిపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. నష్టాల బారి నుంచి తప్పించుకోవడం కోసమే నవయుగ సంస్థ స్టూడియోకు, డిస్ట్రిబ్యూషన్‌కు లింక్ పెట్టేది. ఆ రోజుల్లో పంపిణీదారులు చెప్పేదే వేదం కనుక నిర్మాత సునీల్ చౌదరి సరేనన్నారు. దాసరి కూడా కాదనలేదు.
‘మా బంగారక్క’ చిత్రంలో మురళీమోహన్, శ్రీదేవి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ఈశ్వరరావు, రమాప్రభ, నిర్మల నటించారు. వీళ్లంతా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి నటించాల్సిందే. అయితే ‘మా బంగారక్క’ లో బడ్జెట్లో తీస్తున్న సినిమా కనుక ఆర్టిస్టులందరినీ హోటల్స్‌లో ఉంచితే ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అందుకే హోటల్ రూమ్ అనేది తీసుకోకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ సారథీ స్టూడియోలోనే బస ఏర్పాటు చేశారు. దాసరి, సత్యనారాయణ ఒక గదిలో ఉండేవారు. మురళీమోహన్, ఈశ్వరరావు ఒక రూమ్‌లో ఉండేవారు. శ్రీదేవి వాళ్ల అమ్మతో ఒక గదిలో ఉండేవారు. సంజీవరెడ్డి నగర్లో ఆఫీసు కోసం ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని అందులో కొంత మందిని ఉంచారు. ఈ చిత్రం ఓపెనింగ్ రోజున జయప్రద, మాధవి అతిధులుగా హాజరయ్యారు. జయప్రద, శ్రీదేవి తొలిసారిగా కలుసుకున్న సందర్భం బహుశా ఇదేనేమో!
–వినాయకరావు
