సినిమా చూపించు మామా!
ABN , First Publish Date - 2021-06-23T10:56:59+05:30 IST
తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేశారు. దీంతో థియేటర్లను ఎటువంటి ఆంక్షలు లేకుండా తెరవడానికి మార్గం సుగమమైంది.

- బొమ్మ పడేదెన్నడో.. ఆన్‌లాక్‌తో సర్వత్రా ఆసక్తి..
- రాష్ట్రంలో జూలై మొదటి వారంలో!
- ఆంధ్రలో థియేటర్లు తెరిచేది ఆగస్టులోనే?..
- విడుదలకు సిద్ధంగా పెద్ద సినిమాలు
- రెండు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిస్తేనే బిజినెస్..
- లేదంటే నిర్మాతలకు నష్టమే..
- ఏపీలో టికెట్ ధర పెంపు, బెనిఫిట్ షోల రద్దు..
- ఓటీటీలను సంప్రదిస్తున్న నిర్మాతలు
కుటుంబ సభ్యులంతా థియేటర్‌లో కూర్చుని హాయిగా సినిమా చూసి ఎన్నాళ్లయిందో? లాక్‌డౌన్ ఎత్తేశారనగానే ప్రేక్షకులు ఎంతో సంతోషించారు. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కొవిడ్ కారణంగా కోలుకోలేని దెబ్బతిన్న ఎగ్జిబిటర్లు.. రూ.కోట్లు పెట్టి సినిమాలు నిర్మించి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న నిర్మాతలు.. థియేటర్లు తెరుచుకుంటే మళ్లీ తమకు జీవనోపాధి లభిస్తుందని ఆశిస్తున్న కార్మికులు.. తమ థియేటర్లు ప్రేక్షకులతో ఎప్పుడు కళకళలాడుతాయోనని యజమానులు.. ఇలా ప్రతి ఒక్కరూ ‘బొమ్మ’ ఎప్పుడు పడుతుందోనని నిరీక్షిస్తున్నారు.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేశారు. దీంతో థియేటర్లను ఎటువంటి ఆంక్షలు లేకుండా తెరవడానికి మార్గం సుగమమైంది. కానీ, ఆంధ్రలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే లాక్‌డౌన్ ఎత్తివేశారు. నైట్ కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్లను ఎప్పుడు తెరుస్తారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘‘తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తారని మేం ఊహించలేదు. జూలై మొదటి వారం దాకా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని భావించాం. జూలై మొదటి వారంలో థియేటర్లను ఓపెన్ చేయాల్సి వస్తుందనుకున్నాం. కానీ హఠాత్తుగా లాక్‌డౌన్ ఎత్తేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు’’ అని ఎగ్జిబిటర్స్ అసోషియేషన్‌కు చెందిన సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా ఆంధ్రలో కొనసాగుతూ ఉండడం ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.
‘‘రెండు రాష్ట్రాల్లో చిత్రాలను విడుదల చేసినప్పుడే నిర్మాతకు వ్యాపారం జరుగుతుంది. కేవలం ఒక రాష్ట్రంలో సినిమాను విడుదల చేయాలని ఏ నిర్మాతా కోరుకోడు. అందువల్ల రెండు రాష్ట్రాల్లో పూర్తి సాధారణ పరిస్థితులు ఏర్పడితే తప్ప పెద్ద సినిమాలను విడుదల చేయడం అసాధ్యం’’ అని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో జూలై మొదటి వారంలోను.. ఆంధ్రలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసిన తర్వాత అంటే ఆగస్టులోను థియేటర్లు తెరుచుకొనే అవకాశం ఉంది. ‘‘లాక్‌డౌన్ రెండు రాష్ట్రాల్లో ఎత్తివేసిన తర్వాతే సినిమాలు విడుదలయ్యే అవకాశముంది. ప్రస్తుతం మా లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టులోనే లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేస్తారు. అప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశముంది’’ అని విజయవాడకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అలంకార్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
అసలు కారణమిదేనా..?
లాక్‌డౌన్ 1ను ఎత్తివేసిన తర్వాత క్రాక్, వకీల్‌సాబ్ వంటి పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ప్రేక్షకులు నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే వకీల్ సాబ్ సినిమా విడుదలకు ముందు ఆంధ్ర ప్రభుత్వం టికెట్ ధరను వంద రూపాయలకు పరిమితం చేస్తూ.. బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై చిత్ర పరిశ్రమ ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా జగన్ సర్కారు వెనక్కి తగ్గలేదు. ఈ లోగా లాక్‌డౌన్ 2 రావడంతో ఈ విషయంపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. ‘‘నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు మొదటి పది రోజుల కలెక్షన్ల ద్వారానే లాభాలు వస్తాయి. టికెట్ ధర తక్కువగా ఉండడం వల్ల భారీ బడ్జెట్ సినిమాల మార్కెట్ తగ్గుతుంది.
ఉదాహరణకు ఒక భారీ సినిమా ఉందనుకుందాం. ఇప్పటి దాకా ఉన్న సంప్రదాయం ప్రకారం ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం కూడా టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతి ఇస్తుంది. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోరు. ఇదే విధంగా బెనిఫిట్ షోల వల్ల కూడా నిర్మాతకు లాభాలు వస్తాయి. ఈ రెండు వెసులుబాట్లు లేకపోతే ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాలను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రారు. లాక్‌డౌన్ 2 తర్వాత రావాల్సిన భారీ చిత్రాలకు ఈ సమస్య ఎదురయ్యే అవకాశముంది. ముందు ఈ విషయంలో స్పష్టత రావాలి. లేదంటే థియేటర్లు తెరిచినా ప్రయోజనం ఉండదు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక నిర్మాత అభిప్రాయపడ్డారు.
విడుదలకు సిద్ధంగా సినిమాలు..
లాక్‌డౌన్ 1 తర్వాత థియేటర్లు తెరిచినప్పుడు ముందు పాత సినిమాలను ప్రదర్శించి.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారనే భరోసా వచ్చిన తర్వాతే కొత్త సినిమాలను విడుదల చేశారు. ఈ సారి కూడా ఆ సంప్రదాయమే కొనసాగే అవకాశముంది. అయితే లాక్‌డౌన్1 సమయంలో ఎక్కువ సినిమాలు అందుబాటులో లేవనే ప్రచారం జరిగింది. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేదు. లాక్‌డౌన్ పాక్షిక ఆంక్షలు కొనసాగుతున్న సమయంలోనే నిర్మాతలు షూటింగ్‌లను పూర్తిచేయడానికి ప్రయత్నించారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’, విజయ్ దేవరకొండ ‘లైగర్’, చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’, నాని ‘టక్ జగదీశ్’, రవితేజ ‘ఖిలాడీ’, నాగచైతన్య ‘లవ్‌స్టోరి’, ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’, రానా ‘విరాటపర్వం’ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే థర్డ్ వేవ్ వస్తే ఏం చేయాలనే విషయంపై నిర్మాతల్లో కొంత గందరగోళం నెలకొని ఉంది. దీంతో కొందరు ఓటీటీలను కూడా సంప్రదిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో లైగర్ సినిమా నిర్మాతలు కరణ్‌జోహార్, పూరీ జగన్నాథ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దాదాపు రూ.200 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే తమ సినిమాకు 200 కోట్లు తక్కువని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. వాస్తవానికి ఓటీటీ సంస్థ రూ.115 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని.. ఆ సంస్థపై ఒత్తిడి తేవడానికే విజయ్ ఈ ట్వీట్ చేశాడని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ డీల్ ఓకే అయితే అనేక పెద్ద సినిమాలు ఓటీటీల బాట పట్టే అవకాశం ఉంది.
- సినిమా డెస్క్
కుడి ఎడమైతే..
ఒకప్పుడు చిన్న సినిమాలు విడుదల చేయడానికి థియేటర్లు దొరకని పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే అనిశ్చితితో ఉన్న పెద్ద నిర్మాతలు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో చాలా మంది చిన్న నిర్మాతలు ఆంధ్రలో లాక్‌డౌన్ ఎత్తివేసిన వెంటనే తమ చిత్రాలను విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే విధంగా మల్టీ ప్లెక్స్‌లలో ఇంగ్లిష్ సినిమాల విడుదలకు కూడా కొన్ని చిత్ర నిర్మాణ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. హాలీవుడ్ చిత్రాలను భారత్‌లో విడుదల చేసే కేజీఎఫ్ సంస్థ తన చిత్రాలను వరుసగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒక వేళ థర్డ్ వేవ్ వచ్చి మళ్లీ థియేటర్లను మూసేసినా తమకు పెద్ద నష్టం రాదనే ధీమా చిన్న నిర్మాతల్లో కనిపిస్తోంది.
