టాలీవుడ్‌కు హాలీవుడ్ ఫైట్స్
ABN , First Publish Date - 2021-07-09T05:55:20+05:30 IST
తెలుగు సినిమా స్ఠామినా పెరిగింది. ఇతర భాషల్లో కూడా డిమాండ్ ఏర్పడింది. దానికి తగ్గట్టే సినిమా సినిమాకూ బడ్జెట్ పెరుగుతోంది....

తెలుగు సినిమా స్ఠామినా పెరిగింది. ఇతర భాషల్లో కూడా డిమాండ్ ఏర్పడింది. దానికి తగ్గట్టే సినిమా సినిమాకూ బడ్జెట్ పెరుగుతోంది. కొత్త కథలు, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ లాంటి సాంకేతిక హంగులూ అమరుతున్నాయి. వీటితో పాటు భారీ పోరాట దృశ్యాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఫైట్స్ రొటీన్‌గా ఉండకుండా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా సృజనాత్మకంగా డిజైన్ చేస్తున్నారు. దీనికోసం భారీ పారితోషికాలను చెల్లించి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లను రంగంలోకి దించడానికి కూడా తెలుగు నిర్మాతలు వెనుకాడడం లేదు.
లైగర్‌కు అండీ లాంగ్
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. పూరి జగన్నాథ్ సినిమాల్లో ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇప్పుడు ‘లైగర్’ కోసం ఆయన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ అండీ లాంగ్‌ను రంగంలోకి దించారు. జాకీచాన్ లాంటి సూపర్‌స్టార్స్‌తో కలసి పనిచేసిన అనుభవం అండీ సొంతం. ఇప్పటికే ఆయన తన బృందంతో ఇండియా వచ్చేసి ముంబైలో ‘లైగర్’ షూటింగ్లో పాల్గొంటున్నారు.
లార్నెల్, లాడ్ పోరాటాల గని
బాక్సర్ ‘గని’గా సరికొత్త పాత్రలో కనిపించనున్నారు వరుణ్‌తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో పోరాట సన్నివేశాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. పతాక సన్నివేశాల రూపకల్పన కోసం ప్రత్యేకంగా భారీ స్టేడియం సెట్‌ను నిర్మించారు. హాలీవుడ్ చిత్రం ‘టైటాన్’, బాలీవుడ్ చిత్రం ‘సుల్తాన్’కు ఫైట్స్ రూపకల్పన చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవాల్, లాడ్ రింబుర్గ్ను క్లైమాక్స్ ఫైట్ కోసం రంగంలోకి దించారు.
కత్తిలాంటి నిక్ పావెల్
రాజమౌళి చిత్రాల్లో హీరోలు కత్తుల్లా ఉంటారు. ఆ హీరోలతో కత్తి యుద్ధాలు చేయించేందుకు నిక్పావెల్ను రాజమౌళి రంగంలోకి దించారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రణం రౌద్రం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). రాజమౌళి చిత్రాల్లో యాక్షన్ ఘట్టాలు ఓ రేంజ్లో ఉంటాయి. దానికి తగ్గట్టే ‘ఆర్ఆర్ఆర్’ ఫైట్స్ హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌కు ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ రూపకల్పన చేస్తున్నారు. ఆయన గతంలో హాలీవుడ్లో ‘గ్లాడియేటర్’, ‘ద బోర్న్ ఐడెంటిటీ’, ‘ఎక్స్-మెన్’, రజనీకాంత్ ‘2.0’ చిత్రాలకు వినూత్నంగా పోరాట సన్నివేశాలను రూపకల్పన చేశారు. కత్తియుద్ధంలో నిపుణుడైన నిక్ పావెల్ బాలీవుడ్ చిత్రం ‘మణికర్ణిక’కు పని చేశారు.
విరాటపర్వం
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని కీలక పోరాట సన్నివేశాలకు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రీచర్ రూపకల్పన చేశారు. 30 ఏళ్ల క్రితం జరిగిన కథ కావడంతో నాటి వాతావరణం ప్రతిబింబించేలా పోరాట సన్నివేశాలను రూపొందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్ లోపెజ్ పనిచేస్తున్నారు.
బాలీవుడ్‌లోనూ..
ప్రస్తుతం తెరకెక్కుతున్న పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా హాలీవుడ్ ఫైట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. షారూఖ్‌ఖాన్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘పఠాన్’ సినిమా పోరాట సన్నివేశాలే ప్రత్యేక ఆకర్షణగా తెరకెక్కుతోంది.
భారతీయ సినిమాల్లో ఇప్పటిదాకా చూడని యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది. దీనికోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లను రంగంలోకి దించారు. ‘ఎడ్జ్ ఆఫ్ టుమారో’, ‘బ్లేడ్ రన్నర్ 2049’ చిత్రాలకు పనిచేసిన కే జీ ఓ నెయిల్, ‘మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రొటోకాల్’, ‘టాప్‌గన్ మేవరిక్’కు పనిచేసిన డొమోంకోస్ ‘పఠాన్’ పోరాట సన్నివేశాలను రూపొందించనున్నారు. కట్రినా కైఫ్ ‘సూపర్ హీరో’ చిత్రం, ఆమీర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’, విక్కీ కౌశల్ ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ తదితర చిత్రాలకు హాలీవుడ్ ఫైట్మాస్టర్లు పనిచేస్తున్నారు.
ఇంతకు ముందు...
నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటించిన ‘వైల్డ్‌డాగ్’కు హాలీవుడ్ స్టంట్‌మాస్టర్ డేవిడ్ ఇస్మాలోన్ ఫైట్స్ రూపొందించారు. ఆయన హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’కు పనిచేశారు. సూర్య కథానాయకుడిగా నటించిన ‘ఆకాశమే నీ హద్దు’ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ గ్రెగ్ పావెల్ పోరాటాల రూపకల్పన చేశారు. ‘స్కైఫాల్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ తదితర హాలీవుడ్ చిత్రాలకు, చిరంజీవి ‘సైరా’కూ ఆయన పనిచేశారు.
వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘అంతరిక్షం’ చిత్రం కోసం జీరో గ్రావిటీ నేపథ్యంలో ఫైట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయాల్సి రావడంతో ఆ తరహా చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను ఉపయోగించుకున్నారు. అలాగే మహేశ్ బాబు ‘వన్ నేనొక్కడినే’ చిత్రానికి హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిసానో కొన్ని ఫైట్స్‌కు పనిచేశారు. అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘హలో’ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ ఫైట్స్ కంపోజ్ చేశారు. అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కై చే కంపక్దీ ఫైట్స్ రూపకల్పన చేశారు. ఆయన హాలీవుడ్లో ‘బ్లడ్స్పోర్ట్ 2’, ‘ఒంగ్ బాక్ 2’, ‘సాంక్చరీ’, తమిళ చిత్రం ‘బిల్లా 2’ కు పనిచేశారు. ‘ఇద్దరమ్మాయిలతో’ ఆరు యాక్షన్ సీక్వెన్స్‌లకు అప్పట్లోనే రూ. 2 కోట్లు ఆయనకు పారితోషికంగా ఇచ్చినట్టు సమాచారం. ప్రభాస్ ‘సాహో’కు కెన్నీ బాట్స్, ‘బాహుబలి’ సిరీ్‌సకు లీ విట్టక్కర్ స్టంట్స్ డైరెక్షన్ చేశారు.
స్పెషల్ ఎట్రాక్షన్ పోరాట సన్నివేశాల రూపకల్పనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు ముందుంటున్నారు. అలాగే భారీ గ్రాఫిక్స్‌తో రూపొందే హాలీవుడ్ చిత్రాలకు ఫైట్స్ రూపొందించిన అనుభవం వారికి ఉపయోగపడుతోంది. చాలా సినిమాలకు విదేశాల్లో షూటింగ్ జరుగుతున్నాయి. సౌలభ్యం కోసం కూడా అక్కడ ఉన్న ఫైట్మాస్టర్లను ఎన్నుకుంటున్నారు. అలాగే సినిమాలోని కొన్ని ఫైట్లను లోకల్ ఫైట్ మాస్టర్ల చేత చేయిస్తున్నారు. ముఖ్యమైన ఒకట్రెండు ఫైట్లను హాలీవుడ్ ఫైట్ మాస్టర్లకు అప్పగించడం ఓ అలవాటుగా మారింది.