‘అరణ్య’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2021-03-26T14:13:00+05:30 IST
రానా దగ్గుబాటి.. ఈ పేరు వినగానే ప్రేక్షకుడికి టక్కున గుర్తుకొచ్చే సినిమా ‘బాహుబలి’.

చిత్రం : అరణ్య
నిర్మాణ సంస్థ : ఈరోస్ ఇంటర్నేషనల్
నటీనటులు : రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పింగోల్కర్, రవి కాలే, రఘుబాబు తదితరులు
దర్శకత్వం : ప్రభు సాల్మన్మాన్
నిర్మాణం : ఈరోస్ ఇంటర్నేషనల్
సినిమాటోగ్రఫీ : ఎ.ఆర్.అశోక్ కుమార్
సంగీతం : శాంతను మొయిత్రా
మాటలు, పాటలు : వనమాలి
ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్
రానా దగ్గుబాటి.. ఈ పేరు వినగానే ప్రేక్షకుడికి టక్కున గుర్తుకొచ్చే సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి’ కంటే ముందు రానా.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసినప్పటికీ ‘బాహుబలి’ తర్వాత, పాన్ ఇండియా రేంజ్ యాక్టర్‌గా మరింత ఎలివేషన్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఈరోస్ ఇంటర్నేషనల్ వంటి భారీ సంస్థ, ప్రభు సాల్మన్ వంటి వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కాంబినేషన్లో రూపొందిన త్రిభాషా చిత్రం అరణ్య. ఈ చిత్రం హిందీలో హథీ మేరే సాథీ, తమిళంలో కాడన్ పేరుతో రూపొందింది. గత ఏడాది ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ ప్రభావంతో ఆగింది. ఎట్టకేలకు ఏడాది తర్వాత అరణ్య చిత్రాన్ని మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటే మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘అరణ్య’ హిందీ వెర్షన్ హథీ మేరే సాథీ ఆగింది. అయితే తెలుగులో ‘అరణ్య’, తమిళంలో ‘కాడన్’గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో అడవి మనిషిగా రానా లుక్, నటన, ప్రభు సాల్మన్ ఏనుగులతో చేసిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరి ఈ సినిమా ఈ అంచనాలను అందుకుందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ :-
లక్షకు పైగా మొక్కలు నాటి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న వ్యక్తి నరేంద్ర భూపతి(రానా దగ్గుబాటి). నిజానికి నరేంద్ర పూర్వీకులు తమ ఆధీనంలో ఉండే ఐదు వందల ఎకరాల అడవిని ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. అయితే నరేంద్ర అడవిలోనూ ఉంటూ అక్కడి మనుషులకే కాదు, జంతువులకు కూడా తోడుగా ఉంటాడు. దీంతో అందరూ నరేంద్రను ‘అరణ్య’ అని పిలుస్తుంటారు. అటవీ శాఖా మంత్రి రాజగోపాలం(అనంత్ మహదేవన్) అరవై ఎకరాల అటవీ ప్రాంతంలో ఓ టౌన్ షిప్ నిర్మించాలనుకుంటాడు. టౌన్షిప్ కడితే అక్కడకు వచ్చే ఏనుగులకు ఇబ్బంది కలుగుతుందని అరణ్య పసిగట్టి టౌన్షిప్ నిర్మాణానికి ఒప్పుకోడు. దాంతో మినిస్టర్ తన పొలిటికల్ పవర్‌ను ఉపయోగించి అరణ్యను ఇబ్బంది పెడతాడు. అప్పుడు అరణ్య ఏం చేస్తాడు? టౌన్షిప్ నిర్మాణాన్ని ఆయన చేసిన ప్రయత్నాలేంటి? చివరకు అరణ్య ఎలా గెలిచాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ :-
వైవిధ్యమైన పాత్రలు చేసే రానా దగ్గుబాటి.. ‘అరణ్య’ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. ‘బాహుబలి’ వంటి సినిమా చేసిన రానా, కమర్షియల్ ఫార్మేట్‌కు దూరంగా జరిగి ‘అరణ్య’ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు ముందు తనను అభినందించాలి. సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందరూ రానా డ్యూయల్ యాక్షన్ అనుకున్నారు. కానీ ఒకటే లుక్ ఉంటుందని ఆయన అప్పటి నుంచే స్పష్టం చేస్తున్నాడు. ఈ సినిమాలో ఉన్న భూపతి లుక్, మేనరిజమ్స్ కోసం రానా చాలా కష్టపడ్డాడనే చెప్పాలి. సినిమా మొత్తం ఒకటే మేనరిజాన్ని కంటిన్యూ చేయడం వేరు... ఢిల్లీలో ఛేజింగ్ సందర్భంలోనూ అదే మేనరిజాన్ని కంటిన్యూ చేయడం వేరు. రానా కేరక్టర్‌ని డిజైన్ చేసిన తీరు చూడగానే ‘శివపుత్రుడు’లో విక్రమ్ కేరక్టర్ గుర్తుకొస్తుంది. అయినా కాసేపటికి దేనికదే స్పెషల్ అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సినిమా మొత్తం చాలా చిన్న థ్రెడ్ చుట్టూ సాగుతుంది. ఏనుగులు వెళ్లే దారిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తే దాన్ని అడ్డుకునే వ్యక్తి పోరాటమే అరణ్య. పాత్రలు కూడా పెద్దగా ఉండవు. దానివల్ల అడవులకు సంబంధించిన డ్రోన్ షాట్లు పదే పదే చూపించారు. ఫారెస్ట్ డెన్సిటీ చూపించాలంటే ఒకే డ్రోన్ షాట్‌ని అన్ని సార్లు చూపించాలా? అయితే అన్ని ఏనుగులతో షూటింగ్ చేసిన తీరు బావుంది. విష్ణు విశాల్ ప్రేమకథలో లాజిక్ ఉండదు. అతను ప్రేమించిన మల్లి అనే నక్సలైట్ ఏమైందో? విష్ణు విశాల్ ఏమయ్యాడో తెలియదు. కల్యాణి అనే ఏనుగు చనిపోయినప్పుడు మిగిలిన ఏనుగులన్నీ కలిసి అరణ్యను ఎందుకు తరుముతాయో అర్థం కాదు. అక్కడక్కడా భావోద్వేగాలు ఉన్నట్టే ఉన్నా... వాటి సీక్వెన్స్ ఎక్కడో మిస్ అయినట్టే అనిపిస్తుంది.

చెట్టుమీద రానా చేసే ఫైట్ బావుంది. కానీ అవతలి వ్యక్తి ఎవరో అనామకుడిని పెట్టారు. అలాంటి ఫైట్ పెట్టినప్పుడు అవతలి వ్యక్తి స్ట్రేచర్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకుని ఉంటే బావుండేది. పాటలు సినిమాలో మిళితం కాలేదు. ఎందుకు వస్తున్నాయో, ఏం వస్తున్నాయో కూడా అర్థం కానట్టుగా అనిపించింది. ఎడిటింగ్ షార్ప్ గా ఉండాల్సింది. సెంట్రల్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయిన ప్రాజెక్ట్ అంత సింపుల్‌గా ఉంటుందా?... ఇలాంటి ప్రశ్నలు లాజిక్‌కి అందవు. అక్కడక్కడా కొన్ని డైలాగులు ఆలోచింపజేస్తాయి.
హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం లేదు. రఘుబాబు కామెడీ పండించదు. సినిమా అంతా స్లో పేస్‌లో వెళ్తుంది. ఆ విషయం టైటిల్ పడేటప్పుడే ఆడియన్‌కి అర్థమైపోతుంది. టైటిల్స్ ఒకటే బీజీలో అంత సేపు పడ్డప్పుడే సినిమా ప్రేక్షకుడి సహనానికి పరీక్షే అనే హింట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అడవిని వర్ణిస్తూ, అడవిలో ఉండే విషయాలను తలచుకుంటూ రానా ఫస్ట్ సాంగ్ వచ్చేటప్పుడు, దాని మీద టైటిల్స్ పడి ఉంటే ఇంకాస్త నిడివి తగ్గి ఉండేది. ప్రకృతిని ప్రేమించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఏనుగుల సంరక్షణ, వన సంరక్షణ స్పృహ ఉన్న వారిని కనెక్ట్ అవుతుంది. అంతేగానీ, మామూలుగా ఏదో వినోదం కోసం వెళ్లేవారికి కూసింత నిరాశ తప్పదేమో.
చివరగా... ప్రకృతి ప్రేమికులకోసం ‘అరణ్య’.