తిమ్మరుసును థియేటర్‌లో చూస్తా

ABN , First Publish Date - 2021-07-29T08:01:03+05:30 IST

‘‘తిమ్మరుసు’ చిత్రం పెద్ద విజయం సాధించి, లాక్‌డౌన్‌ తర్వాత రాబోతున్న సినిమాలకు ఆక్సిజన్‌లా మారి బూస్టప్‌ ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నాని అన్నారు...

తిమ్మరుసును థియేటర్‌లో చూస్తా

‘‘తిమ్మరుసు’ చిత్రం పెద్ద విజయం సాధించి, లాక్‌డౌన్‌ తర్వాత రాబోతున్న సినిమాలకు ఆక్సిజన్‌లా మారి బూస్టప్‌ ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో నాని అన్నారు. సత్యదేవ్‌ కథానాయకుడిగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిమ్మరుసు’. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ముందస్తు విడుదల వేడుకలో నాని పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘బార్లు, పబ్బులతో పోల్చితే థియేటర్లు చాలాసేఫ్‌. ‘తిమ్మరుసు’తో మళ్లీ మనం థియేటర్లలో సినిమాలు చూడడం మొదలుపెట్టాలి. నేను కూడా నా కుటుంబంతో కలసి థియేటర్లలో ఈ సినిమాను చూస్తాను’’ అని అన్నారు. సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఓపెన్‌ యూనివర్సిటీ. కరోనా రెండో దశ తర్వాత థియేటర్లలోకి వస్తున్న తొలి చిత్రం మా ‘తిమ్మరుసు’. శరణ్‌ కొప్పిశెట్టి అద్భుతంగా తెరకెక్కించాడు. ఎంతో కష్టసాధ్యమైన ఫైట్స్‌ చేశాను. ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నిర్మాత కోనేరు మహేశ్‌ మాట్లాడుతూ ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అందరం కొవిడ్‌ సమయంలో కష్టపడి, ఇష్టపడి ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు థియేటర్‌లో మా సినిమాను చూడాలి’’ అని దర్శకుడు కోరారు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించారు. 


Updated Date - 2021-07-29T08:01:03+05:30 IST