చిత్రను వరించిన పద్మభూషణం

ABN , First Publish Date - 2021-01-27T07:54:08+05:30 IST

సింధుభైరవి సినిమాలో- ‘పాడలేను పల్లవైన.. భాషరాని దానను.. వేయలేను తాళమైన లయ నేనెరుగను’ అంటూ సంగీత ప్రియులను ఊర్రూతలూగించిన...

చిత్రను వరించిన పద్మభూషణం

సింధుభైరవి సినిమాలో- ‘పాడలేను పల్లవైన.. భాషరాని దానను.. వేయలేను తాళమైన లయ నేనెరుగను’ అంటూ సంగీత ప్రియులను ఊర్రూతలూగించిన అద్భుత గాయని చిత్రకు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. తన గాత్రంతో దక్షిణభారత దేశంలో అందరికీ సుపరిచితమైన చిత్రకు పురస్కారాలు.. గౌరవాలు కొత్త కాదు.


చిత్ర పుట్టింది.. పెరిగింది కేరళలోని తిరువనంతపురంలో. చదివింది కేరళ విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ. ఒక సాధారణ మ్యూజిక్‌ టీచర్‌ కావాలని భావించిన చిత్రకు సినీ రంగంలో అనుకోకుండా అవకాశం వచ్చింది. చిత్ర సినీ సంగీతరంగంలోకి ప్రవేశించే సమయానికి సుశీల, జానకి, వాణీజయరామ్‌ వంటి గాయనీమణులు అగ్రస్థానాల్లో ఉన్నారు. వారితో పోటీపడుతూ.. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవటం అంత సులభం కాదు. చిత్ర స్వరం తెలుగులో తొలిసారిగా వినిపించింది ‘సింధుబైరవి’ అనువాద చిత్రంతో. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆమె పాడిన ‘పాడలేను పల్లవైనా’ అనే పాట ఆ కాలంలో ఒక సంచలనం. ఆ తర్వాత తెలుగులో చిత్ర వెనక్కి తిరిగి చూడలేదు. ‘అబ్బ దాని సోకు సంపెంగ రేకు’ (ఆఖరి పోరాటం),   ‘ఒళ్లంత జల్లింత కావాలిలే’.. ‘ఓ ప్రియా..ప్రియా’ (గీతాంజలి) సినిమాల ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కెరీర్‌ ప్రారంభంలో  తనకు అత్యద్భుతమైన పాటలు ఇచ్చిన ఇళయరాజాను చిత్ర గురువుగా తలుస్తారు. ప్రత్యేకాభిమానం కనబరుస్తారు. ఇళయరాజా మ్యూజిక్‌తో ప్రారంభమయిన ఆమె కెరీర్‌.. ఆ తర్వాత అప్రతిహతంగా సాగింది. కె.వి.మహదేవన్‌, చక్రవర్తి, రాజ్‌కోటి, రెహమాన్‌, కీరవాణి- ఇలా సంగీత దర్శకులందరూ ఆమె చేత పాటలు పాడించటం మొదలుపెట్టారు.  ఏడాది తిరగకుండా వంద పాటలు పాడటం ఒక విధంగా రికార్డే!


సంగీత కుటుంబం 

చిత్ర కుటుంబంలోని వారందరికీ స్వరజ్ఞానముంది. ఆమె తల్లి శాంత, తండ్రి కృష్ణన్‌ నాయర్‌ ఇద్దరూ సంగీత కళాకారులే! ఇక సోదరి బీనా వేణుగోపాల్‌ కొన్ని మలయాళ చిత్రాల్లో పాటలు పాడారు. తమ్ముడు మహేష్‌ మంచి గాయకుడే కాదు.. గీటార్‌, మృదంగ వాయిద్యకారుడు కూడా! ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన చిత్ర- తన జీవితంలో ఉన్నతమైన విలువలను పాటిస్తారు. రికార్డింగ్‌లకు లేటుగా రాకపోవటం.. సంగీత దర్శకులు చెప్పిన విషయాలను వెంటనే గ్రహించటం.. ఎన్ని సార్లైనా రిహార్సల్స్‌ చేయటం.. సీనియర్స్‌ను గౌరవించటం లాంటి లక్షణాలు ఆమెకు ఎంతో తోడ్పడ్డాయి.  చిత్ర భర్త విజయశంకర్‌ ఎలక్ర్టానిక్‌ ఇంజనీర్‌. చిత్ర రికార్డింగ్‌ థియేటర్‌ ప్రారంభించిన తర్వాత ఆయన కూడా దానిలో భాగస్వామి అయ్యారు.


గౌరవాలు అనేకం..

భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్‌, అరడజను జాతీయ పురస్కారాలు, ఎనిమిది సార్లు నంది అవార్డులు, అంతకు రెట్టింపు సార్లు కేరళ ప్రభుత్వ పురస్కారాలు, మూడు సార్లు తమిళ, కర్ణాటక పురస్కారాలు.. ఇవే కాకుండా చైనా, బ్రిటీష్‌ ప్రభుత్వాలనుంచి సన్మానాలు. 


25 వేల పాటలు.. 

చిత్ర తెలుగు, తమిళ,  కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, గుజరాతి, తులు, రాజస్థాని, ఉర్దూ, సంస్కృతం, బడగ, మలై, లాటిన్‌, అరబిక్‌, సింహళ, ఇంగ్లిషు వంటి  భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు.


సంగీత ప్రపంచానికి మంచి రోజు

‘‘గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మ విభూషణ్‌, గాన కోకిల చిత్రగారికి పద్మభూషణ్‌ అవార్డులు ప్రకటించడం సంగీత కళాకారులందరికీ ఆనందకరమైన రోజు. అందుకే  ఈ గణతంత్ర దినోత్సావాన్ని ఎప్పటికీ మరచిపోలేం. నేను, రాజ్‌ కెరీర్‌ ప్రారంభించిన రోజుల్లో సుశీలమ్మ, జానకమ్మ అద్భుత గాయనీమణులు. ఆ సమయంలో వచ్చిన ఫ్రెష్‌ వాయిస్‌ చిత్రగారిది. మా ఇద్దరి సంగీత దర్శకత్వంలో బాలు, చిత్ర కలసి ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఆమె పాడిన పాటలన్నీ సూపర్‌హిట్టే. మా జానర్‌ సంగీతానికి ఆమె ఓ వరంలా దొరికిందని చెప్పాలి. కంపోజర్స్‌గా మేం కట్టిన బాణీకి తగ్గట్టు, ఆ ట్యూన్‌లో ఉన్న జీవాన్ని అర్థం చేసుకుని పాడడం ఆమెకు మాత్రమే సాధ్యం. జానకమ్మ  తర్వాత చిత్రకు మాత్రమే దక్కిన వరమది. చాలామంది సింగర్స్‌ చెప్పింది చెప్పినట్లు పాడతారు. కానీ చిత్ర ఇంప్రవైజ్‌ చేసి పాడతారు. చిన్నతనంలోనే శాస్ర్తీయ సంగీతం నేర్చుకుని, ఏసుదాసుగారి దగ్గర ఎన్నో షోల్లో పాడిన అనుభవంతో మా దగ్గరకి వచ్చారు. ఆమె కెరీర్‌లో ఎక్కువ పాటలు మాకే పాడారనుకుంటా. మలయాళీ అయినప్పటికీ ఆమె గొంతులో  తెలుగు చాలా స్పష్టంగా పలుకుతుంది. అప్పట్లో మేమెంత బిజీగా ఉండేవాళ్లమో తనూ అంతే బిజీగా ఉండేది. డేట్స్‌ కుదరని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో నేను  కోపంతో ఉంటే, సైలెంట్‌గా థియేటర్‌లోకి వెళ్లి పాట పూర్తి చేసి కూల్‌ చేసేది. ఆమె పాడిన పాటల్లో ‘మనసున ఉన్నది చెప్పాలనున్నది’, కళ్లల్లోకి కళ్లుపెట్టి చూడవెందుకు’, 


‘ఈ క్షణం ఒకే ఒక కోరిక’ పాటలంటే చాలా ఇష్టం. సౌందర్యగారి కోసం నేను కంపోజ్‌ చేసిన ‘కోపం వస్తే మండుటెండ.. మనసు మాత్రం వెండి కొండ’ పాటను నేను ఎలాగైతే అనుకున్నానో అలాగే పాడిందామె. హై పిచ్‌లోనూ, లో పిచ్‌లోనూ డెప్త్‌ చూపించగల వాయిస్‌ ఆమెది.


బాధకరమైన విషయం...

జానకమ్మగారికి జాతీయ అవార్డు వచ్చినా ఆమె తిరస్కరించారు. సుశీలమ్మకు రాకపోవడం  నిజంగా బాధాకరమే. అయితే ఈ సంతోష సమయంలో కాంట్రవర్సీల జోలికి పోకుండా బాలుగారిని మరోసారి గుర్తు చేసుకుందాం. చిత్రను మనస్పూర్తిగా అభినందిద్దాం. ఎందుకంటే ఇది సంగీత ప్రపంచానికి చాలా మంచిరోజు.

Updated Date - 2021-01-27T07:54:08+05:30 IST