భారతీరాజా సినిమాలు గుర్తొచ్చాయి

ABN , First Publish Date - 2021-02-08T06:46:46+05:30 IST

‘‘నేటితరం కథలు, ట్రెండీ సినిమాలంటూ మనం మరో పంథాలో వెళ్లిపోతున్నాం. మన మట్టి కథలు రావాలి. కనుమరుగై పోతున్న మన కథల్ని గుర్తు చేస్తూ...

భారతీరాజా సినిమాలు గుర్తొచ్చాయి

‘‘నేటితరం కథలు, ట్రెండీ సినిమాలంటూ మనం మరో పంథాలో వెళ్లిపోతున్నాం. మన మట్టి కథలు రావాలి. కనుమరుగై పోతున్న మన కథల్ని గుర్తు చేస్తూ, ఇది కదా మన నేపథ్యం అని చెప్పే చిత్రమిది. ఇదొక దృశ్యకావ్యం అని చెప్పడం అతిశయోక్తి కాదు. ‘ఉప్పెన’ మరో ‘రంగస్థలం’ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని చిరంజీవి అన్నారు. ఆయన మేనల్లుడు పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. దేవిశ్రీప్రసాద్‌ స్వరకర్త. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి బిగ్‌ టికెట్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘కరోనా తర్వాత ఓ పెద్ద వేడుకలో పాల్గొవడం శుభారంభంలా అనిపిస్తుంది.  ఈ సినిమా చూశాక ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమా గొప్పతనం గురించి చెప్పాలనిపించింది. అంత అద్భుతంగా బుచ్చిబాబు పనితీరు, దర్శకత్వ విలువలు ఉన్నాయి. మనం ఎన్నో ప్రేమకథలు చూశాం. ఇందులో ఉన్న ఎమోషన్స్‌ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. స్ర్కీన్‌ప్లేకి ఈ చిత్రం ఓ మంచి ఉదాహరణగా నిలుస్తుంది. నాకైతే సినిమా చూస్తున్నంత సేపు 80, 90ల్లో భారతీరాజా తీసిన సినిమాలు గుర్తుకొచ్చాయి. విజయ్‌ ేసతుపతి నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. వైష్ణవ్‌తేజ్‌ మా కుటుంబానికి గర్వకారణం. అంత బాగా నటించాడు. కథానాయికగా కృతిశెట్టికి మంచి భవిష్యత్తు ఉంది. మైత్రీ సంస్థలో ప్రతి హీరో పనిచేయాలనుకుంటారు. సినిమాపై వాళ్లకున్న ప్రేమే అందుకు కారణం’’ అని అన్నారు. వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘మా అమ్మ త్యాగం, మా మావయ్యలు లేకపోతే నేను, మా అన్నయ్య ఇక్కడివరకు వచ్చేవాళ్లం కాదు. మావయ్యలకి జీవితాంతం రుణపడి ఉంటాం. బుచ్చిబాబు రాసిన కథే ఈ సినిమాకి హీరో’’ అన్నారు. సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబు ‘ఉప్పెన’ కథ చెప్పగానే గది మొత్తం గంభీరమైంది. అప్పుడే ఇది వంద కోట్ల సినిమా అని చెప్పా. బుచ్చికి చాలా భవిష్యత్తు ఉంది. ఈ సినిమా జర్నీ అందరికీ సులభంగా కనిపించొచ్చు. కానీ, బుచ్చి ఈ చాలా కష్టమైన ప్రయాణం చేశాడు’’ అని అన్నారు. ‘‘సుకుమార్‌గారు నాలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. ఈ సినిమా చేయడం నా అదృష్టం’’ అని కృతీశెట్టి అన్నారు. ‘‘సుకుమార్‌ సర్‌ లెక్కలు చెప్పకపోతే దర్శకత్వం కాకుండా ఇంకేదో చేసుకునేవాణ్ణి. ‘ఉప్పెన’ కథని ఎలా రాశానో, అలాగే తెరకెక్కించా. చాలా భావోద్వేగంతో రాసిన కథ ఇది’’ అని బుచ్చిబాబు చెప్పారు. చిత్ర యూనిట్‌తోపాటు కిషోర్‌ తిరుమల, వెంకీ కుడుముల, సందీప్‌రెడ్డి వంగా, శివ నిర్వాణ, గోపీచంద్‌ మలినేని, బాబీ, కొరటాల శివ, హరీష్‌ శంకర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-02-08T06:46:46+05:30 IST