పనామా పేపర్స్ లీక్స్ కేసులో ఐశ్వర్యరాయ్‌ని.. ఈడీ ఏమని ప్రశ్నించిందంటే..
ABN , First Publish Date - 2021-12-21T18:42:51+05:30 IST
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ ‘పనామా పేపర్స్ లీక్స్’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే...

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ ‘పనామా పేపర్స్ లీక్స్’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. 2016లో ఎంతో సంచలనం సృష్టించిన ఈ కేసుతో ఎంతోమంది ప్రముఖులకు సంబంధం ఉన్నట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అప్పటి నుంచి చాలామందిని ఎంక్వైరీ చేసింది ఈడీ. కాగా ఓ ఫేక్ కంపెనీతో ఐశ్వర్యకి సంబంధం ఉన్నట్లు అనుమానించిన ఈ శాఖ చాలా రోజులుగా ఆమెను విచారించడానికి ప్రయత్నిస్తోంది.
అయితే, ఇప్పటికే వివిధ కారణాల వల్ల రెండుసార్లు విచారణకు హాజరు కాలేదు ఐశ్వర్య. కానీ డిసెంబర్ 20న మాత్రం ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్‌లో ఈడీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది ఈ భామ. కాగా, విచారణకు హాజరైన ఈ తారని ఆ శాఖ ఏమని ప్రశ్నించిందంటే..
బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో 2005లో రిజిస్టరైన అమిక్ పార్టనర్స్ కంపెనీకి, మీకు సంబంధం ఏంటి?
మొసాక్ ఫోన్సెకా కంపెనీని రిజిస్టర్ చేసిన న్యాయ సంస్థ మీకు తెలుసా?
ఈ కంపెనీ డైరెక్టర్లలో మీరు, మీ నాన్న కోటేదాడి రమణ రాయ్ కృష్ణ రాయ్, మీ తల్లి కవితా రాయ్, మీ సోదరుడు ఆదిత్య రాయ్ ఉన్నారు. దీని గురించి ఏం చెబుతారు?
ప్రారంభంలో చెల్లించిన క్యాపిటల్ 50,000 డాలర్లు. 1 డాలరు విలువ చేసే 12,500 షేర్లు ఒక్కో డైరెక్టర్‌కి ఉన్నాయి. మొదట డైరెక్టర్‌గా ఉన్న మీరు అనంతరం ఎందుకు వాటాదారు అయ్యారు?
జూన్ 2005లో మీరు కేవలం వాటాదారుగా ఎందుకు మారారు?
2008 నుంచి ఆ కంపెనీ ఎందుకు పనిచేయట్లేదు?
ఆర్థిక లావాదేవీల కోసం ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా?
అంటూ పలు ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. అయితే వీటికి ఐశ్వర్య ఏం సమాధానాలు ఇచ్చిందో తెలియరాలేదు.