లక్ష్మికి ఎన్టీఆర్ వేసిన శిక్ష !
ABN , First Publish Date - 2020-05-17T09:01:40+05:30 IST
మహానటుడు ఎన్టీఆర్, నటి లక్ష్మి తొలిసారిగా కలసి నటించిన చిత్రం ‘ఒకే కుటుంబం’. నటుడు నాగభూషణం నిర్మించిన ఈ చిత్రానికి

మహానటుడు ఎన్టీఆర్, నటి లక్ష్మి తొలిసారిగా కలసి నటించిన చిత్రం ‘ఒకే కుటుంబం’. నటుడు నాగభూషణం నిర్మించిన ఈ చిత్రానికి ఎ.భీమ్‌సింగ్ దర్శకుడు. ఒక రోజు షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్, కాంతారావు, లక్ష్మి కాంబినేషన్లో సీన్ చిత్రీకరించాలి. అయితే కాంతారావు ఆ రోజు షూటింగ్‌కు రావడం ఎందుకో లేట్ అయింది. క్రమశిక్షణకు ఎంతో విలువ ఇచ్చే ఎన్టీఆర్ అది సహించలేకపోయారు. ఆయన కోపం చూసి సెట్లో అంతా వణికిపోయారు. ఆ తర్వాత కాసేపటికి కాంతారావు భయపడుతూనే సెట్లోకి వచ్చారు. ఎన్టీఆర్ ఆయన్ని ఏమీ అనలేదు. షాట్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత అందులో బాగా నటించిన కాంతారావును ముందు అభినందించి, ఆ తర్వాత వృత్తిలో క్రమశిక్షణ చాలా ముఖ్యం బ్రదర్ అంటూ క్లాస్ తీసుకొన్నారు.
ఆ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌తో కలసి ‘బంగారు మనిషి’ చిత్రంలో నటించారు లక్ష్మి. తొలి సినిమా అనుభవంతో ఎన్టీఆర్ సెట్లో రావడానికి ముందే మేక్‌పతో సిద్ధంగా ఉండేవారు లక్ష్మి. అయితే ఒక రోజు అనుకోకుండా ఆమెకు లేట్ అయింది. భయపడుతూనే ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి ‘సారీ సార్.. కొంచెం లేట్ అయింది’ అని చెప్పారు లక్ష్మి. ఎన్టీఆర్ చిరునవ్వుతో ‘ఇట్సాల్ రైట్’ అన్నారు. ‘లేట్‌గా వచ్చినందుకు మీకు శిక్ష విధించాల్సిందే’ అని ఇంటి దగ్గర నుంచి తన కోసం వచ్చిన టిఫిన్ అంతా ఆమెతో తినిపించారు ఎన్టీఆర్.
‘బంగారు మనిషి’ చిత్రంలో లక్ష్మి, ఎన్టీఆర్